14, డిసెంబర్ 2009, సోమవారం

ప్రజల మనసులను విష పూరితం చేయడం ఇంత సులభమా ?

భారత దేశం ,పాకిస్తాన్ లను తెల్లదొరలు విభజించినప్పుడు హిందూ ,ముస్లిముల మధ్యన మతకలహాలు చెలరేగి కొన్ని వేలమంది చని పోయారని చరిత్ర చదివినప్పుడు ,ఒకే దేశం లో ఉన్న ప్రజల మధ్యన ఒకరినొకరు చంపుకునేంతగా ద్వేషంఎందుకు వస్తుందో నాకు అంతగా అర్థం అయ్యేది కాదు.కానీ రాజకీయనాయకులు తలచుకుంటే అదేమీ పెద్ద విషయంకాదని ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థం అయ్యింది.తెల్ల దొరసాని చేసిన రాష్ట్రవిభజన ప్రకటన ఇంత వరకూ కలసి మెలిసిఉన్న తెలంగాణా ,ఆంధ్ర ప్రజల మనసులను విషపూరితం చేసినాయి.తెలంగాణా ఇచ్చినా లేకున్నా ఇరు ప్రాంతాల ప్రజలు మనసులను విషతుల్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది.

13, డిసెంబర్ 2009, ఆదివారం

ఈ వేర్పాటు ఉద్యమాలు ప్రజలను గొర్రెలను చేయడానికి రాజకీయనాయకులు పన్నిన కుట్ర.

ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ అయి పోయి జాతీయవాదం లేకుండా పోయింది.ఉదాహరణకు ఈ వాళ తమిళనాడు వాళ్ల కంటే మనకు ఎం.పిలు ఎక్కువ ఉన్నా మనకు కేంద్ర కాబినెట్ లో సరైన బెర్తులు దొరక లేదు.తమిళనాడు వాళ్ళది ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్లు బ్లాక్ మెయిల్ చేసి మంత్రుల ఫోర్టుఫోలియోలు గాని ,నిధులు ,పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ల రాష్ట్రానికి తరలించుకొని పోతున్నారు. చిన్న చిన్న బ్లాక్మెయిల్ లకు భయపడి రాష్ట్రాలను విభజించు కుంటూ పొతే దేశం చాలా ముక్కలు అయి పోయి దేశ సమగ్రతకే ముప్పు ఏర్పడుతుంది.ఇవాళ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది.మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను నిలదీసి అడగాలి,ఎందుకు వెనకబడి ఉన్నామో .అది చేతగానప్పుడు ఎన్ని రాష్ట్రాలు అయిన కూడా అభివృద్ధి అనేది ఏమీ జరగదు.అభివృద్ధి కోసం కొట్లాడాలి.ఈ వాళ తెలంగాణా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది.అప్పుడు పాలకులు వాళ్ల తప్పును కప్పిపుచ్చుకోవడానికి తిరిగి వేర్పాటు వాద ఉద్యమాలు మొదలు పెడుతారు.అప్పుడు ఉత్తర తెలంగాణా లేక దక్షిణ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని ఇంకొకరు వచ్చి ఉద్యమం మొదలు పెట్టి ప్రజలను తమ మౌళిక సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తారు.ఈ వేర్పాటు ఉద్యమాలు ప్రజలను గొర్రెలను చేసి వాళ్ల హక్కుల కోసం పోరాడకుండా డైవర్ట్ చేయడానికి ,వేర్పాటు ఉద్యమ నాయకులు ధనవంతులు అవ్వడానికి,కొన్ని రాజకీయ పదవులు పొందడానికి తప్ప ప్రజలకు మేలు చేయడానికి మాత్రం కాదని ప్రజలు గుర్తిస్తే చాలా మంచిది.

12, డిసెంబర్ 2009, శనివారం

రాజశేఖర రెడ్డి వర్గాన్ని చిన్నాభిన్నం చేసిన ముసలి నాయకులు.

రాజశేఖర రెడ్డి గారి అనుకూల వర్గ ఎం.ఎల్.ఎ ల లో తెలంగాణా అనే తేనెతుట్టె ను కదిపి విజయవంతంగా చీలిక తీసుకు వచ్చిన కాంగ్రెస్స్ అధిష్టానం.ఆ విధంగా జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కాంగ్రెస్స్ లోని ముసలి నాయకులు అధిష్టానం ద్వారా విజయవంతంగా దెబ్బ కొట్టినారు.

కే.సి.ఆర్ మరో నిజాం లాంటి వాడు.

తెలంగాణా లోని ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన నిజాం రాజును ,ఆ ఇబ్బంది పడిన ప్రజలు ఇంకా బ్రతికి ఉండంగానే పొగిడిన కే.సి.ఆర్.కు జై కొడితే నిజాం చెర నుండి తెలంగాణా ను విడిపించడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయని ఒక సారి తెలంగాణా బిడ్డలు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది.అటువంటి కే.సి.ఆర్. వలన తెలంగాణా వస్తే నిజాం రాజ్యం లోని పరిపాలన కంటే భిన్నంగా ఏమీ ఉండదు అని తెలంగాణా బిడ్డలు ఆలోచించాలి.తిరిగి రెండు జర్మనీలు ఏకీకరణం అయినట్లు ఏదో ఒక రోజు తిరిగి రెండు తెలుగు ప్రాంతాలు ఏకం కాక తప్పదు.

10, డిసెంబర్ 2009, గురువారం

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

కాంగ్రెస్స్ అధిష్ఠానం ప్రజలలో పలుకుబడి లేని,ప్రజల నాడి తెలియని నాయకుల (ఉదా:-వి.ఎచ్.,కే.కే.) మాటలు విని తెలంగాణాకు సై అని పప్పులో కాలేసింది.ప్రజలలో పలుకుబడి లేని కే.సి.ఆర్ లాంటి ఒక నాయకుడు నిరాహారదీక్ష అని బ్లాక్ మెయిల్ చేస్తే దానికి భయపడి ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సంసిద్ధం కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు.అదే కే.సి.ఆర్. తెలంగాణాకు చెందిన ఇతర కాంగ్రెస్స్ నాయకులను ఎలా తిట్టారో అప్పుడే మర్చి పొయినారా?జగన్ విషయం లో అధిష్ఠానం చెప్పిన నిర్ణయానికి కాంగ్రెస్స్ ఎం.ఎల్.ఎ లు తలోగ్గినట్లే ఈ విషయంలో కూడా వాళ్లు మాట వింటారని కాంగ్రెస్స్ అధిష్ఠానం అనుకొంది.ప్రజాభిప్రాయం తో సంభంధం లేకుండా అధిష్ఠానం అనే అహంకారంతో ,నిరంకుశత్వంగా వ్యవహరించి ఈ వాళ కొరివితో తల గోక్కున్నట్లు అయ్యింది.కే.సి.ఆర్ కు తిరుగులేని ప్రజా బలం ఉండి,తెలంగాణా వాదం ఉన్నప్పుడే వై.ఎస్. గారు ఆ సమస్యను చాలా తేలికగా తీసుకొని ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు.ఈ వాళ తెలంగాణ వాదం బలహీన పడి, టి.ఆర్.ఎస్. పార్టీ తన ఉనికి కోల్పోతున్నప్పుడు ఈ సమస్యను కాంగ్రెస్స్ అధిష్ఠానం పరిష్కరించలేక చేతులు ఎత్తి వేసే పరిస్థితి వచ్చింది.కావున కాంగ్రెస్స్ సీనియర్లకు ఈ వాళ అయినా తెలిసిరావాలి,రాష్ట్రంలో వై.ఎస్.ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్స్ అంటే వై.ఎస్.,వై.ఎస్. అంటే కాంగ్రెస్స్ అని.అధిష్ఠానం అంటూ ఏమీ లేదని.ఈ వాళ పరిస్థితి విడవ మంటే పాముకు కోపం,కరవ మంటే కప్పకు కోపం లా కాంగ్రెస్స్ అధిష్ఠానం పరిస్థితి అయ్యింది.

ఈ వార్త విని వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది.

ప్రజలలో నుండి వచ్చిన బలమైన నాయకుడు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాంతీయ వాదాల్ని ఒంటిచేత్తో ఆపగలిగాడు. తెలంగాణాకు రాజశేఖర రెడ్డి మాత్రమే అడ్డం అని ప్రచారం తో ఊదరగొట్టినా ,టి.ఆర్.ఎస్.,మిగతా పార్టీలన్నీ ఒక వైపు ఉండి ఎలెక్షన్లలో పాల్గొన్నా,అభివృద్ధి అనే నినాదంతో ఒంటి చేత్తో కాంగ్రెస్స్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ,టి.ఆర్.ఎస్. ను పది సీట్లకు మాత్రమే పరిమితం చేసి తెలంగాణావాదం ఏమీ లేదని తేల్చేశాడు.టి.ఆర్.ఎస్. పార్టీ కూడా అధినేత మీద విశ్వాసం లేక చిన్నాభిన్నమైనది.కానీ రాజశేఖర రెడ్డి గారు చని పోయిన తర్వాత చచ్చిపోయిన తెలంగాణా వాదాన్ని సెలైన్ ను పెట్టి తిరిగి బతికించి ఈ రోజు కేంద్రం తో తెలంగాణాకు సై అనిపించారు. ఈ పరిణామాల్ని చూస్తున్న రాజశేఖర రెడ్డి గారి ఆత్మ తీవ్రంగా క్షోభిస్తూ ఉంటుంది.

4, డిసెంబర్ 2009, శుక్రవారం

అభివృద్ధి అంటే ఒక చార్మీనార్ ,ఒక సాలార్జంగ్ మ్యూజియం కట్టడం కాదు

బ్రిటిష్ వాళ్లు మనలను పాలించేటప్పుడు వాళ్ళను తరిమి వేస్తే ప్రజలంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ,సుఖ సంతోషాలతో తులతూగుతారని ప్రజలంతా భ్రమ పడ్డారు.కానీ ఈ వాళ ఏమైంది.స్వాతంత్ర్యం వచ్చి అరవై సంవత్సరాలు పైబడింది.కానీ ఇప్పటికి కూడా కోట్ల మంది ప్రజలు ఒక్క పూట తిండికి కూడా నోచుకోకుండా ఉన్నారు.కనీసం రాజ్యాంగం కల్పించిన కనీస మౌలిక హక్కులు కూడా పొంద లేని పరిస్థితిలో ఉన్నారు.ఆ నాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళలో గాంధీజీ,భగత్సింగ్,సుభాష్ లాంటి నిస్వార్థ పరులు ఉండే వారు. కానీ ఈ వాళ తెలంగాణా విముక్తి కోసం పోరాటం చేస్తున్నానని చెబుతున్న కే.సి.ఆర్. లాంటి వ్యక్తుల విశ్వసనీయత ఎలాంటిదో ప్రజలకు తెలుసు.తెలంగాణా ఉద్యమం చేపట్టక ముందు కే.సి.ఆర్. ఆస్తి ఎంత ,ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత.ఈ వాళ తెలంగాణా రాష్ట్రం విడిపోయినా కూడా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.అక్కడ దోపిడీ ఉండదని ప్రజలకు హామీ ఇస్తారా? ఈ వాళ ఆంధ్ర ప్రజలను బూచిగా చూపించి తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న వారు ,తెలంగాణా వచ్చిన తర్వాత అమాయక తెలంగాణా బిడ్డలను దోచుకోరని గ్యారెంటీ ఉందా.ప్రతి సమాజంలో పీడించే వాళ్లు ,పీడితులు ఉంటారు.ప్రజలు మోసపోకుండా హుషారుగా ఉండాలి,అంతేగాని తెలంగాణా వచ్చినంత మాత్రాన ఆ రాష్ట్రంలో అందరూ ఉత్తములు ఉండరు.హైదరాబాదు ముందే ఎంతో అభివృద్ధి చెందిందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాతనే వెనక పడినామని చెబుతున్నారు.అభివృద్ధి అంటే ఒక చార్మినార్,ఒక సాలార్జంగ్ మ్యూజియం కట్టడం కాదు.ప్రజలకు తగిన విద్యాబుద్దులు ఉండి వాళ్ల బతుకులు వాళ్లు బతికే విధంగా చేయడం.కానీ ఈ రోజుకు కూడా తెలంగాణా లోని ప్రజలు ఎంతో అమాయకంగా ,రకరకాల మూఢ నమ్మకాలలో బతుకుతున్నారు.ఎవరో వచ్చి వాళ్ళను మోసం చేస్తారని భ్రమల్లో ఉన్నారు.వాళ్ల మీద వాళ్లకు నమ్మకం లేదు.కావున ఎంత అభివృద్ధి చెందిందో ,మేము ముందే అభివృద్ధి చెంది ఉన్నామని చెప్పే తెలంగాణా మేధావులు జవాబు చెబితే బాగుంటుంది.తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు ఏదో ఒరిగి పోతుందని చెప్పి తెలంగాణా ప్రజలను ఎండమావుల వెంట పరిగెత్తించేది మానుకుంటే బాగుంటుంది.

3, డిసెంబర్ 2009, గురువారం

కే.సి.ఆర్ కంటే బాలాథాక్రే చాలా నయం

తెలంగాణా అనే భావోద్వేగ సమస్యని తెలంగాణా లోని రాజకీయ నాయకులు చాలా బాగా క్యాష్ చేసుకుంటున్నారు.మొదట చెన్నారెడ్డి ఆ సమస్యను ఉపయోగించుకొని అనేక పదవులు పొందినారు.ఇప్పుడు కె.సి.ఆర్. అదే పనిలో ఉన్నారు.ఒక వైపు ఏమో చచ్హేంత వరకు నిరాహారదీక్ష అంటున్నాడు, మరోవైపు ఏమో ఖమ్మంలో సౌకర్యాలు లేవంటున్నాడు.చచ్హేవానికి సౌకర్యాలతో ఏం పని.దీన్ని తెలంగాణా ప్రజలు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ ప్రజలు.ఎందుకంటే తెలంగాణా వాళ్ళు కలుస్తామంటే కర్నూలు రాజధానిని పోగొట్టు కొని హైదరాబాదు రాజధానిని ఒప్పుకున్నారు.హైదరాబాదు బాగా అభివ్రుద్ది చేసు కున్న తర్వాత తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు.నాకు తెలిసినంత వరకు రాజధాని వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ రాష్ట్ర విభజన కోరలేదు,తెలంగాణా వాళ్ళు తప్ప.తెలంగాణా వాళ్ళ కంటే బాలాథాక్రే చాలా నయమని పిస్తుంది.ఎందుకంటే ఆయన ముంబాయి మరాఠీ లది మాత్రమే అంటున్నాడు.కానీ ఇక్కడ ఆంధ్రావాలే భాగో అంటున్నారు.తెలుగువాళ్ళం అయి ఉండి తెలంగాణా ప్రాంతంలో ద్వితీయ శ్రేణి పౌరులులాగా భయపడుతూ ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు.తెలంగాణా ఉద్యమానికి నిధులు పంపిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రవాస తెలంగాణా ప్రజలూ మీరు ఒక సారి ఆలోచన చేయాలి.ఎందుకంటే అక్కడి ప్రజలు మిమ్ములను కూడా భాగో అనే పరిస్థితి వస్తుంది.

1, డిసెంబర్ 2009, మంగళవారం

మళ్ళీ విజయవంతంగా దీక్ష ను ముగించిన కే.సి.ఆర్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకముందే బి.జే.పి తో పొత్తుకు సై చెప్పిన కే.సి.ఆర్. ఆ పార్టీ అధికారం లోకి రాక పోయేసరికి ,కాంగ్రెస్స్ తో దగ్గర కావడానికి నిరాహార దీక్ష అనే కొత్త పథకం రచించాడు.ఇలాంటి పథకాలు వేస్తే కాంగ్రెస్స్ పార్టీ దగ్గరకు తీసుకొని కేంద్రం లో ఏదో ఒక పదవి ఇస్తుందని ఆయన ఆశ పడి దీక్ష డ్రామా మొదలు పెట్టినాడు.మునుపటి లాగే దీక్ష డ్రామా లానే ముగిసింది.మళ్ళీ కే.సి.ఆర్. విజయవంతంగా దీక్షను ముగించాడు.

13, నవంబర్ 2009, శుక్రవారం

చంద్రబాబు మరియు ఆయన మిత్రబృందం రెండు నాల్కల ధోరణి

మార్గదర్శి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ,ప్రభుత్వం ప్రజల రక్షణకు తనకున్న పరిధిలో చర్యలు తీసుకుంటే చంద్రబాబు గారు మరియు ఆయన మిత్రబృందం కలిసి ఈనాడు పత్రిక మీద మరియు మీడియా మీద దాడి అని ఎంతో హడావిడి చేసారు.అదే ఈ రోజున జగన్ మీద ఎన్నో ఆరోపణలు అదే చంద్రబాబు మరియు ఆయన మిత్ర బృందం సంధిస్తున్నారు.వాళ్లకు ఇప్పుడు మీడియా మీద దాడి గా కనిపించడం లేదా?ఎందుకంటే జగన్ కు కూడా మీడియా ఉంది. కాంగ్రెస్స్ పార్టీ వాళ్లకు చంద్రబాబు గారి లాగా గోబెల్స్ ప్రచారం చేయడం చేతకాదేమో.చంద్రబాబు గారి రెండు నాల్కల ధోరణి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది.చంద్రబాబు గారు ఇటువంటి పనులు చేయడం వలన విశ్వసనీయత ఎప్పుడో పోగొట్టుకున్నారు. మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన వెంట నడిస్తే, వీళ్ళు కూడా ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని ప్రజలలో చెల్లకుండా పోతారు.

11, నవంబర్ 2009, బుధవారం

2012 లో యుగాంతం -మార్కెట్ వర్గాల కుట్ర

2012 లో యుగాంతం గురించి మధ్యన మీడియా లో చాలా హడావిడి కనిపిస్తుంది.ప్రతిదినమూ విషయాన్ని ప్రసారంచేస్తూ ,ప్రజలను చాలా భయానికి గురి చేస్తున్నారు.దీన్ని నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక మార్కెట్ వర్గాల కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆర్ధిక మాంద్యం పరిస్థితులలో మార్కెట్లో డబ్బులు లేవు కాబట్టి ,ప్రజలను ఎలాగోలా భయపెట్టి వాళ్ల దగ్గరఉన్నడబ్బు బయటికి తీయించి ఖర్చు పెట్టించాలనే యోచన కనిపిస్తున్నది. విధంగా ఆర్ధిక మాంద్యం నుండి బయటపడాలనే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తున్నది.

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

కాంగ్రెస్స్ పార్టీ "సో కాల్డ్ "సీనియర్ల రాజ్యాంగ ద్రోహం

కాంగ్రెస్స్ పార్టీకి సంభందించి నాయకులకు ప్రజలలో ఎవరికి ఎంత పలుకు బడి ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలాబాగా తెలుసు. రోజు రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత సో కాల్డ్ సీనియర్ లనే ప్రజా బలం లేని వృద్ద నాయకులఅర్థం లేని ప్రకటనలు చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది.ముఖ్యమంత్రి ఎంపికలో ముఖ్య పాత్ర వహించాలిసిందిఎం.ఎల్. లు మాత్రమే అనే ప్రాథమిక రాజ్యాంగ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధిష్టానం ,లేక సీనియర్లు అనే వితండవాదాన్ని తెర పైకి తెచ్చి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారు .ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న ఎం.ఎల్. లుమాత్రమే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి.అప్పుడు మాత్రమే ప్రజాభిప్రాయం ప్రతిఫలిస్తుంది,లేకపొతే తెలుగు వాడిఆత్మగౌరవ నినాదం తిరిగి తెరపైకి వచ్చి కాంగ్రెస్స్ పార్టీ తిరిగి రాష్ట్రంలో భ్రష్టు పట్టి పోతుంది. రాష్ట్రం లో రాజశేఖర రెడ్డిగారి విశ్వసనీయత ను చూసి ప్రజలు కాంగ్రెస్స్ పార్టీకి ఓట్లు వేసినారు గాని సోనియా గాంధిని,సోకాల్డ్ సీనియర్లను చూసికాదు. విషయాన్ని కాంగ్రెస్స్ పార్టీ అధిష్టానం గుర్తించి ,ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే పార్టీ రాష్ట్రంలోబట్టకడుతుంది,లేకపొతే అధికారాన్ని బంగారుపల్లెంలో పెట్టి వేరే పార్టీ కి ఇచ్చిన వాళ్ళవుతారు.

అదే బ్లాగు పేరు ఇతరులు పెట్టుకోవచ్చా..

బ్లాగు కు మనం పెట్టిన పేరు ఇతరులు పెడితే అది మార్చడానికి ఏమి చేయాలి.అదే పేరు ఇతరులు కూడా పెట్టుకోవచ్చా. వాళ్ళకు ఈ విషయాన్ని తెలియ చెప్పినా మార్చాక పొతే ఏమి చేయాలి.ప్రొఫైల్ లో ఎవరు ముందు బ్లాగు మొదలు పెట్టినారు అని క్లియర్ గా ఉన్నా మార్చక పొతే ఎవరికీ కంప్లైంట్ చేయాలి దయ చేసి తెలపగలరు.

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

వై.ఎస్.జగన్ నే సి.యం. చేయాలి.

వై .ఎస్. జగన్ నే సి.యం.చేయాలి.ఈ వాళ ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజాకర్షణ ఉన్నది జగన్ కే .రాష్ట్రం అంతా అనుచర గణం జగన్ కు ఉంది.రాష్ట్ర కాంగ్రెస్స్ లో ఎవరికీ అంతటి ప్రజాకర్షణ ,అనుచర గణం లేదు.జూనియర్ అని జగన్ ను పక్కన పెట్టకూడదు.జూనియర్ అని రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టి , చాలా రోజులు ప్రజలలో అభిమానం లేని ముసలి నాయకులు అదికారాన్ని అనుభవించారు.చివరికి రాష్ట్రంలో కాంగ్రెస్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అదే జూనియర్ పార్టీ ని అధికారంలోకి తీసుకు వచ్చి ప్రజా రంజకంగా పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయినాడు.పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సీనియర్లంతా ఏం చేసారు.వారసత్వం అనే దాన్ని అనర్హతగా చూడకూడదు.కాబట్టి జగనే సి.యం .పోస్టు కు సరి అయిన వ్యక్తి .

3, సెప్టెంబర్ 2009, గురువారం

రాజన్నా మాకోసం మళ్ళీ పుట్టి రా ....

రాజన్నా మీ మరణాన్ని మేము జీర్ణించుకో లేకున్నాము.మా కోసం నీవు మళ్ళీ పుట్టి రా రాజన్నా .నీ కోసం మేమంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ......

ఆగి పోయిన తెలుగు ప్రజల హృదయ స్పందన ...

ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల హృదయ స్పందన ఆగి పోయింది.అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పరితపించిన మనసున్న మనిషి ఇక లేడు అని వార్తను ఇప్పటికీ నమ్మలేకున్నాము.నిన్నటి నుండి ఏదో మిరాకిల్ జరిగి ఆయనకు ఏమీ కాదు అని అను కుంటూ ఉంటిని,కాని దేవుడు చిన్నచూపు చూసినాడు.ఇంతమంది ప్రజాభిమానాన్ని చూరగొన్న రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఇంతకు ముందు లేడు,ఇక రాడు.ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఆయనను మృత్యుదేవత ఇంత నిర్దాక్షిణ్యంగా కబలిస్తుందని ఊహించలేదు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని భాదాతప్త హృదయం తో దేవుని మనసారా ప్రార్థిస్తూ......

16, ఆగస్టు 2009, ఆదివారం

ధనవంతుల జబ్బు

స్వైన్ ఫ్లూ గురించి ప్రభుత్వాలు,మీడియా చాలా హడావిడి చేస్తున్నాయి,ఎందుకంటే ఇది విమానాల ద్వారా విదేశాలనుండి దిగుమతైన ధనవంతుల జబ్బు కాబట్టి.మన దేశంలో మలేరియా ,అతిసార వలన కొన్ని వేల మంది ప్రతిసంవత్సరం మరణిస్తున్నారు.ఒక్కరోజైనా ప్రభుత్వాలు ,మీడియా ఇంతగా స్పందించాయా?ప్రజల ప్రాథమిక హక్కుఅయిన రక్షిత మంచి నీరు కూడా పొందలేక మధ్యన హైదరాబాదు లో చాలా మంది చని పోయారు.ప్రజలకు కనీసవైద్యం అందించ లేని ప్రభుత్వాల చేతగాని తనం వలన మన దేశం లో గర్భిణుల ,శిశువుల ,గిరిజనుల,ప్రజల మరణాలుసంభవిస్తున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాల విలువ ప్రభుత్వాల,మీడియా దృష్టిలో ఏంటో ఇప్పుడు అర్థం అవుతున్నది. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవద్దని నేను చెప్పడం లేదు.జాగ్రత్తలు తీసుకోవలసిందే,కానీ సామాన్యప్రజలకు వచ్చే నయం చేయగలిగే జబ్బులను కూడా ప్రభుత్వాలు పట్టించుకొని ,వారి ప్రాణాలకు కూడా ధనవంతుల ప్రాణాల కున్న విలువలో కొంత విలువైన ఇస్తే చాలా సంతోషం.

5, ఆగస్టు 2009, బుధవారం

చిరంజీవిగారి స్వయంకృతాపరాధం

చిరంజీవి గారి పార్టీ నుండి ఒక్కక్కరూ నిష్క్రమిస్తున్నారు.దీనికంతటికి చిరంజీవిగారు చేసుకున్నస్వయంకృతాపరాధమే.ఆయన మార్పు అని వచ్చి అధికారమే పరమావధిగా, ఇతర పార్టీ నుండి వచ్చిన వారిని ఇష్టంవచ్చినట్లు తీసుకున్నారు.వాళ్లకు అధికారం దక్కలేదు కాబట్టి వాళ్ల దారి వాళ్లు చూసుకుంటున్నారు.చిరంజీవిగారుకొత్తవాళ్ళకు ,ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వాళ్లకు,అవినీతి మకిలి వీలైనంత తక్కువ అంటిన వాళ్లకు ,ఇప్పుడునడుస్తున్న రాజకీయానికి భిన్నమైన రాజకీయం చేయాలనే వాళ్లకు ,మేధావులకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.ఏదో ప్రయోజనం ఆశించి వచ్చిన వాళ్లు ,ఒక్కక్కరు బయటికి వెళుతుంటే అక్కడ ఉన్న వాళ్లకు కూడాతమ తమ రాజకీయ భవిష్యత్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.ప్రజలకు కూడా పార్టీ ఉంటుందా మునుగుతుదా అని డైలమా లో పడ్డారు.

రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ,అప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న మెజారిటీ వ్యక్తులకు టిక్కెట్లుఇచ్చినారు.రామారావు గారిని టిక్కెట్లు అమ్ముకున్నారని ఒక్కరు కూడా వేలెత్తి చూపలేదు. చిరంజీవి గారికి రామారావు గారికి అదే తేడా .అందుకే రామారావు గారు అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించినారు.ప్రజలకుఏమాత్రం తెలియని వాళ్లు కూడా రామారావు గారి బొమ్మ పెట్టుకొని విజయం సాధించినారు.ఇప్పుడున్న తెలుగుదేశంపార్టీకి అప్పటికి తేడా ఉంది,అది వేరే విషయం.

5, జులై 2009, ఆదివారం

లోకసత్తా పార్టీ మీద చంద్రబాబు గారి గోబెల్స్ ప్రచారం

చంద్రబాబు గారు లోక్సత్తా పార్టీ మీద తిరిగి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టినారు.ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు మాత్రమే అర్హతలు ఉన్నాయని ఆయన భ్రమ.లోక్సత్తా ,ప్రజారాజ్యం వాళ్లు వచ్చి ఆయన ఓటు బ్యాంకు ను కొల్లగొట్టారని ఆయన ఆరోపణ.ఏదో ఆయన జాగీరు పోయినట్లు,ఆయన అధికారంలోకి రాకపోవడం ఆంధ్రప్రజలు చేసుకున్న పాపం లాగా ఆయన చాలా బాధపడిపోతున్నారు.ఆయనకు విశ్వసనీయత లేదని మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు తేల్చేశారు.ఆయన ఏ రోజు కూడా ప్రజల అవసరాలు గుర్తించలేదు.ఎంతసేపు ఆయన దృష్టి అంతా అధికారాన్ని ఏదోవిధంగా పొందడమే.ఈవాళ లోక్సత్తా మీద ఆయన ఆరోపణలుచూసి ప్రజలు నవ్విపోతున్నారు.ప్రజలకు కొత్తరాజకీయాన్ని పరిచయం చేసిన లోక్సత్తా లాంటి పార్టీని ఆయన కాంగ్రెస్ ఏజెంటు లాగా అభివర్ణిస్తే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు.చంద్రబాబుగారి మీద కొంతమందికి అంతో ఇంతో ఉన్న సానుకూల మైన అభిప్రాయం కూడా ఈ వాళ పటాపంచలయి పోయింది.ఈ ప్రకటన తో ఆయన విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింది.ఆయన వైఖరి ఎలా ఉందంటే ఏదైనా పోటీలో నేనొక్కన్నే ఆడతాను ,అందులో నేనే మొదటి ,తర్వాతి స్థానాలలో ఉంటాను మిగతా వాళ్ళంతా చూస్తూ ఉండండి అనే విధంగా ఉంది.ఆయన ఓటమి ని క్రీడా స్ఫూర్తితో తీసుకోలేకున్నారు.ఆయన మానసిక పరిస్థితి ఇలాగే ఉంటే ఆయన పార్టీ పరిస్థితి ,ఆయన్ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది.తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుగారే గుదిబండగా మారే పరిస్థితి ఉంది.

12, జూన్ 2009, శుక్రవారం

జూనియర్ డాక్టర్ల లొల్లి

జూనియర్ డాక్టర్లు మళ్ళీ లొల్లి మొదలు పెట్టినారు.డాక్టర్లను ఎవరూ ఊరకే కొట్టరు.ఆవతల వ్యక్తికి చాలా కడుపు మండుతే తప్ప ఊరకనే ఎవరూ కొట్టరు.ప్రభుత్వాసుపత్రులలో డాక్టర్లు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.నాకు కూడా ప్రభుత్వాసుపత్రిలో ఒక అనుభవముంది.మా బంధువు ఒకాయన కు చేయి విరిగితే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాం.అక్కడ డాక్టర్లకు ప్రతి ఒక్కరికీ ప్రేవేట్ ప్రాక్టీసు ఉంది.అక్కడ డాక్టర్లు అందరూ విదేశీ కార్లు వాడుతున్నారు.అక్కడ మా బంధువును చూసిన తర్వాత అక్కడ డాక్టరు తన ప్రవేట్ క్లినిక్కు కు రమ్మని అడ్రస్ చెప్పాడు.అక్కడ బేరం మొదలు పెట్టినాడు.మేము అంత డబ్బు ఇవ్వమని చెప్పేసరికి మాకు పదునైదు రోజులు అడ్మిస్సినే దొరకలేదు.అడ్మిట్ అయిన తర్వాత ఒక డాక్టరు ఉదయం ఇంజేక్షేన్ వ్రాసి పోతే అది వేయడానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు .అక్కడ ఉన్న నర్సులను అడిగితే మేము వేయకూడదు.జూనియర్ డాక్టరు వేస్తాడు,అని చెప్పేవాళ్ళు.జూనియర్ డాక్టర్లు ను అడిగితే చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పేవాళ్ళు.చివరకు రోజంతా ప్రయత్నం చేసినా గానీ ఇంజక్షన్ వేయించు కోలేకపోయాము.మాకేమో ఇన్ఫెక్షన్ వస్తుందని భయం.చివరికి అక్కడ నుండి డిశ్చార్జ్ చేయించుకొని పుత్తూరు కు వెళ్లి కట్టుకట్టించుకొని వచ్చినాము.అటువంటి సందర్భములో కొట్టాలని అనిపించదా? ప్రభుత్వం ఆసుపత్రుల మీద ,డాక్టర్లమీద ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంది.కానీ డాక్టర్లకు కొంచం కూడా సామాజిక భాద్యత లేదు.వీళ్ళు డాక్టరులుగామారడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ప్రజల సొమ్మే అని వీళ్ళు మర్చిపోతున్నారు.ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకుజవాబుదారీగా లేనంతవరకూ ప్రజలకు వేరే మార్గంలేక ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూనేఉంటారు.జూనియర్ డాక్టర్లు స్త్రైకులు,ధర్నాలు చేస్తే వాళ్ల డిగ్రీ ని రద్దు చేయాలి.ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కువాళ్లకు లేదు.వీళ్ళు ప్రతిసారీ ఇలాగే చేస్తున్నారు.కావున వాళ్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడకూడదు.

6, జూన్ 2009, శనివారం

భూస్వామ్య భావజాలం

చాలా మంది రాజకీయనాయకులు మేము దళితులకు స్పీకరు పదవి ఇచ్చినాము.మైనారిటి లకు రాష్ట్రపతి పదవి ఇచ్చినాము అనడం ఫ్యాషన్ అయి పోయింది.అంటే వాళ్లకు ప్రతిభ లేదా .వీళ్ళు ఇచ్చేవాళ్ళు ,దళితులు పుచ్చుకునేవాల్లా.ప్రతిభా భారతి గారిని,బాలయోగి వంటి దళితులను స్పీకరు ను చేసినాము అని ,మరియు కలాం గారి లాంటి మైనారిటి ని రాష్ట్రపతిని చేసినాము అని చంద్రబాబు గారు,ఈ మధ్యన మీరాకుమార్ లాంటి దళిత మహిళ ను లోక్సభ స్పీకర్ ను చేసినామని కాంగ్రెస్స్ వాళ్లు చాలా సార్లు అంటున్నారు.అంటే దళితులైన ,మైనారిటి లైన వీళ్ళందరికి ప్రతిభ లేదా.వాళ్ల వాళ్ల ప్రతిభను బట్టి వాళ్లకు ఆ పదవులు దక్కినాయి.ప్రజాస్వామ్య భారతదేశం లో ప్రజలందరికీ వాళ్ల వాళ్ల ప్రతిభను బట్టి ఎలాంటి పదవైనా పొందే అవకాశం ఉంది. దళితులని ఆ పదవులు ఇచ్చినాము అనడం దళితులను ,వాళ్ల ప్రతిభను అవమానించడమే అవుతుంది.మన రాజ్యాంగాన్ని వ్రాసింది ఒక దళితుడే. కావున ఆ మాటను పదేపదే అనడం భూస్వామ్య భావజాలమే అవుతుంది.మన రాజకీయనాయకులు ఆ పద ప్రయోగం మానుకుంటే దళితుల ను , మైనారిటి ల ను నిజంగా గౌరవించి నట్లవుతుంది.

4, జూన్ 2009, గురువారం

చంద్రబాబు గారి విజ్ఞత ను చూసారా?

ఎన్నికలు అయి ,ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రకటనలు,ఆయన ముఖంలోని భావాలను గమనించినట్లైతే అధికారం అనేది ఈ రాష్ట్రంలో ఆయనకు తప్ప వేరే ఎవరికీ ఇవ్వకూడదు,రాజరికం లాగా ఆయననే ప్రతిసారీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండ పెట్టాలి అనే భావనతో ఉన్నారు.లోక్సత్తా ,ప్రజారాజ్యం పార్టీలు వచ్చి మమ్మలను ప్రతిపక్షంలో కూర్చో పెట్టినారు అన్నాడు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పార్టీ పెట్టి వాళ్ల విధానాలు చెప్పుకొని ఎన్నికలలో పోటీ చేయవచ్చు.వాళ్ళొచ్చి ఈయన జాగీర్దారును లాక్కోన్నట్లు ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్దంగా మాట్లాడాడు.తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతాడని ఊహించలేదు.అటువంటి ఫ్యూడలిస్టిక్ భావాలు కలిగిన వ్యక్తి తో తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాలించ బడినారంటే అది ప్రజల ఖర్మ . అసెంబ్లీ లో స్పీకరు గా ఎన్నికైన వ్యక్తిని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అతని స్థానానికి పిలుచుకొని పోవడం ఒక సాంప్రదాయం.మొదటి సారి అసెంబ్లీ కి వచ్చినపార్టీ సభ్యులు కూడా చాలా హుందాగా ఆ సంప్రదాయం పాటించారు.ఈయన ఆ సంప్రదాయాన్ని కూడా పాటించ కుండా ప్రజాస్వామ్య వ్యవస్థ లో స్పీకరు స్థానానికున్న గౌరవాన్ని దిగజార్చారు.ఈ రోజు అసెంబ్లీ లో ఆయన హావభావాలు పరిశీలిస్తే ఆయన చాలా అన్ ఈసీ గా కూర్చున్నట్లు కనిపించింది.ముఖ్యమంత్రి పీఠం ఆయన జన్మ హక్కు అయినట్లు,దాన్ని వేరెవరో ఆయననుంచి బలవంతంగా లాక్కున్నట్లు ఆయన భావాలు కన్పిస్తున్నాయి.వాళ్ల సభ్యుడు మాట్లాడు తూ స్పీకర్ స్థానానికి కులాన్ని,ప్రాంతాన్ని అంటగడుతూ మాట్లాడాడు.ముఖ్యమంత్రి,ప్రతిపక్షనాయకుడు,స్పీకర్ ముగ్గురూ ఒకే ప్రాంతం నుండి వచ్చినట్లు తెలుగుదేశం వాళ్లకు బాధగా ఉంటే ప్రతిపక్ష నాయకుని పదవిని చంద్ర బాబు గారిని త్యజించి వేరే ప్రాంతం వాళ్లకు ఇస్తే సరి పోతుంది.ఇప్పుడు చంద్రబాబు గారి కి వచ్చిన సీట్లు ఆయన ముఖం చూసి ఎవరూ ఓట్లు వేయలేదు.మహా కూటమి కట్టడం వలెనే ఆయనకు ఆ సీట్లు వచ్చినాయి అని ఆయన గుర్తు పెట్టుకుంటే మంచిది.చంద్రబాబుగారిని నమ్మడం ప్రజలు ఎప్పుడో మర్చి పోయినారు.ఆయన ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తి తో వ్యవహరిస్తే ఆయన గౌరవం మరియు శాసన సభ గౌరవం ఇనుమడిస్తుంది.లేదంటే రామారావు గారు ప్రజలకు ఎంతో సేవ చేయాలనీ స్థాపించిన పార్టీని ,చంద్రబాబు గారిని ప్రజలు ఛీ కొడతారు.

1, జూన్ 2009, సోమవారం

ఆధునిక వెట్టిచాకిరి

కార్పోరేట్ కాలేజీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.తమ కాలేజీ లకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి ,ఇంతమంది .ఐ.టి లకు సెలెక్ట్ అయినారని తిరిగి తమ విద్యా వ్యాపారాన్ని పెంచు కోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు.ఎంతమంది పరీక్షలు వ్రాసినారు,సీట్లు,ర్యాంకులు రాని వారు ఎంతమంది కాలేజీ లలో ఉన్నారనే విషయం ఎవరికీ తెలియడంలేదు. కాలేజీలు తల్లితండ్రులను,పిల్లలను తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ,తాముకోటీశ్వరులు కావడానికి పావులుగా వాడుకుంటున్నారు,తప్ప పిల్లల భవిష్యత్ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు.సివిల్ సర్విసులలో నెగ్గిన వాళ్లు కూడా రోజుకు ఎనిమిది గంటలు చదివితే చాలంటున్నారు.కానీ కాలేజీలు పిల్లలనుఒక రూము కు పరిమితము చేసి సుమారు పంతొమ్మిది గంటలు చదివిస్తున్నారు.చదివించడమనే దాని కంటే యాజమాన్యాలు కోటీశ్వరులు కావడానికి పిల్లల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారని చెప్పవచ్చు.పిల్లలకు ఆటలు ,మరే ఇతర వ్యాపకాలు లేకుండా చేసి వారిని మానసిక వికలాంగులుగా మారుస్తున్నారు. కాలేజీ లు సాగిస్తున్నఅరాచకాలను,ఆధునిక వెట్టి చాకిరి ని అడ్డుకోక పోతే సమాజం భ్రష్టు పట్టి పోతుంది.



30, మే 2009, శనివారం

బాబు గారి మరియు చిరంజీవి గారి విస్లేసన

చందబాబు గారు మరియు చిరంజీవి గారు ఇప్పటికి మారలేదు.ఓటమిని నిష్పక్షపాతంగా విస్లేసించలేకున్నారు.ఒకాయనేమో యి.వి.యం ల వలన ఓడిపోయినామంటున్నారు.ఇంకొక ఆయనేమో ప్రధానమంత్రి పథకాల వలన ఆయన ఓడిపోయినామని అంటున్నాడు.చిరంజీవి గారు మార్పు అంటూ వచ్చి చాలా మంది పాతకాపులకే టికెట్లు ఇచ్చి ,మూస రాజకీయాలు నడిపినాడు.అందువల్లనే ఆయనను కూడా ప్రజలు మిగతా పార్టీ ల గాటనే కట్టేశారు.ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని నిష్పక్షపాతంగా విస్లేసించుకొని చేసే పనులు మార్చు కుంటే ప్రజల ఆదరణ పొందుతారు,లేకుంటే చరిత్రలో కలసిపోతారు.

18, మే 2009, సోమవారం

సూడో సెక్యులరిజం

నిజామాబాదు లో పి.సి.సి. అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఓటమి సూడో లౌకికవాదులకు ఒక కను విప్పు కావాలి."మైనారిటీల మీదకి చేయి చూపిస్తే ఆ చెయ్యి ఉండదని ",మైనారిటీ లు ఉన్న సభలో మాట్లాడుతూ అన్నట్లు పత్రికలలో వార్తలు వచ్చినాయి.అది చూసి హిందువులంతా బి.జే.పి అభ్యర్థికి గంపగుత్తగా ఓట్లు వేసి శ్రీనివాస్ గారిని ఓడించినట్లున్నారు. ఈ వాళ దేశం లో కాంగ్రెస్,సమాజ్ వాదీ,ఆర్.జే.డి. లాంటి పార్టీ లు సూడో లౌకికవాద రాజకీయాలు నడిపినారు కాబట్టే ,బి.జే.పి లాంటి మతతత్వ పార్టీ లు బలం పుంజుకున్నాయి. మోడి లాంటి నాయకులు బలపడడానికి అవకాశం ఏర్పడింది.భిన్న మతాలు,కులాలు,సంస్క్రతులు ఉన్న దేశంలో పార్టీలు,నాయకులు సూడో లౌకిక వాదాన్ని వదిలి పెట్టి నిజమైన లౌకిక వాదులుగా మారితే ప్రజలకు,దేశానికి మంచిది.

16, మే 2009, శనివారం

జయహో ఓటరు మహాశయా!


ఈ ఎన్నికలలో దేశ ప్రజలు ,ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చినారు.ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు.

  • ముఖ్యంగా చంద్రబాబు గారి మోసపూరితమైన హామీలను నమ్మలేదు.అన్ని పార్టీలను కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రజాసేవ కంటే అధికారమే పరమావధి గా పని చేసినారు.ఆయన విశ్వసనీయతను , చిత్తశుద్ది ని ప్రజలు ఎవరూ నమ్మలేదు."ముఖ్యంగా నాయకులు విశ్వసనీయత,చిత్తశుద్ది ఒక సారి కోల్పోతే ప్రజలు వారిని నమ్మరని తేలిపోయింది."
  • సామాజిక న్యాయం అంటూ వచ్చి రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న ఇంకొక ఆయనను చిత్తుగా ఓడించినారు. ముఖ్యంగా మార్పు అంటూ వచ్చిన ఆయన లోకసత్తా లాగా నిజాయితీ పరులకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేదేమో.ఈయన కూడా అధికార పేఠమే పరమావధిగా ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినాడు.సభలకు వచ్చిన ప్రజలను చూసి అదంతా తన బలుపు అనుకొని ఆయన గాల్లో తేలిపోయినాడు.చివరికి అది వాపు అని తేలిపోయింది.చివరకు పాలకొల్లులో ఒక మామూలు మహిళ చేతిలో మెగాస్టార్ తలవంచ వలసింది. ఓట్ల కంటే ముందే ముఖ్యమైన నాయకుల ను కోల్పోయిన ప్రజారాజ్యం పార్టీ ,ఈ వాళ ఓట్లలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ,పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోయింది."ఈ వాళ ప్రజారాజ్యం తరుపున గెలిచిన వాళ్లు కూడా తమ సత్తాతో గెలిచిన వాళ్ళే,చిరంజీవి చరిష్మా ఏమీ పని చేయలేదని తేలిపోయింది."
  • కమ్యూనిస్టులు అధికారాన్ని ఆశిమ్చ కుండా ప్రజా ఉద్యమాలను నిర్మించి నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వాలకు చేస్తూ ,ప్రతిదినమూ ఒక పార్టీ తో అధికారంకోసం జట్టు కట్టేది మానుకొని వాళ్లు స్వంతం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి.విశ్వసనీయత లేని పార్టీలతో వీళ్ళు జట్టు కడితే వీళ్ళ విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది.
  • సినిమా వాళ్లు కూడా ,వాళ్ల గురించి వాళ్లు ఎక్కువగా ఊహించు కునేది మానుకోవాలి.నిన్న గాక మొన్న సినిమాలలోకి వచ్చి రెండు మూడు సినిమాలు విజయవంతమైన హీరోలందరూ కూడా ,ప్రజలు వీళ్ళు ఏది చెపితే అది వినే వెర్రి వాళ్లు అనుకొని జనాన్ని చూస్తూనే పూనకం వచ్చిన వాళ్ళలా ఇష్టమొచ్చిన డైలాగులు చెప్పి ,తొడలు కొట్టి ,మీసాలు తిప్పి నానా హంగామా చేసినారు.ప్రజా సేవ అంటే మూడు గంటల సినిమా కాదని ప్రజలు తేల్చేసారు.
  • చివరగా కాంగ్రెస్స్ పార్టీ కి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని ,ఓటరు తీర్పు ఇచ్చినాడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చేత్తప్పుడు ఆ భూమి కోల్పోయే పేద రైతు ల కడుపు మంటను గుర్తు పెట్టుకొని పని చేయాలని ,ప్రభుత్వ పతకాలను ప్రజలందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరవేయాలని,ఊర్లలో ఉండే చోటా లీడర్లను అదుపులో పెట్టుకొని ప్రజలకు ప్రభుత్వ పతకాలు నేరుగా అవినీతి లేకుండా చేరవేస్తే తిరిగి అయిదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్స్ వాళ్ళదే అవుతుంది.
  • ఒకసారి ఎన్నికవగానే సేవకులనే మాట మరిచిపోయి ప్రభువులమని అనుకుని ప్రజాసేవపట్టని నాయకులను ,మంత్రులను ఓడించి,ఓటరు వారికి ఒక మంచి గుణపాఠం చెప్పినాడు.
  • లోకసత్తా నాయకుని గెలిపించి ప్రజలు తమకు మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని ,అవినీతి రహిత సమాజం కావాలని ,ప్రజాస్వామ్య పునాదులు ఇంకా గట్టి పదాలని,ఓట్లను డబ్బు తో కొనే విధానం పోవాలని చాలా బలంగా ,గట్టిగా కోరుకున్నారు.

14, మే 2009, గురువారం

ఆర్దిక మాంద్యంలో ఆంధ్రలో బాబు గారి పాలన ఉండింటే?


బాబు గారు తిరిగి అధికారం లోకి వస్తే అంతే.ఈ రోజు ఆర్థిక మాంద్యంలో కూడా ప్రజలు అంతో ఇంతో బాగున్నారంటే అది కాంగ్రెస్స్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలవలనే.ఒక వేళ బాబు గారు ఈ అర్థిక మాంద్యం ఉన్న రోజుల్లో అధికారంలో ఉండింటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొనేవారో.ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక శాతం ప్రజలకు ఉపయోగపడే ఐ .టి గురించి మాత్రమే మాట్లాడే వాడు.ఆయన హై క్లాసు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే వాడు.ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పాల పరిశ్రమ ,వ్యవసాయం పెట్టు కొని స్వయం సమ్రుద్ది సాధించి సంతోషంగా ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా మారలేదు.అన్నీ ఫ్రీ గా ఇస్తానని అంటున్నాడు.ఎంతసేపు ప్రజలను భిక్షగాల్లను చేసి ఆయన పబ్బం గడుపు కోవాలని చూస్తున్నాడు.
ఈ ఆర్థికమాంద్యం రోజుల్లో బాబు గారు అధికారం లో ఉండింటే అని ఆలోచన వస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.

9, మే 2009, శనివారం

నడమంత్రపుసిరి

తమ దాకా వచ్చేదాకా తెలియదన్నట్లు ,ఈవాళ స్కూలు ఫీజులు పెంచినారని ధర్నాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు .విద్య,వైద్యం,గృహవసతి మధ్య తరగతి వారికి అందుబాటులో లేకుండా చేసింది నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళే .ఉదాహరణకు :-సాఫ్టువేరు ఉద్యోగస్తులు,మిగతా వైట్ కాలర్ ఉద్యోగస్తులు (క్షమించాలి ).వీళ్ళకు ఏదయినా ఒక వస్తువు ధర కానీ,ఒక సేవ ధర కానీ తక్కువ ఉంటే ఆ వస్తువు కు నాణ్యత లేనట్లే .పది రూపాయల వస్తువు విలువ వంద రూపాయలు చెబితే అది చాలా నాణ్యమైనదని కొనుక్కుంటారు.అసలు విలువ చెబితే వీళ్ళు కొనరు.అందుకే మార్కెట్టులో వస్తువు,సేవల విలువలు అంతగా పెరిగి సామాన్యుని కి అందుబాటులో లేకుండా పోయినాయి.

నేను ఒక సారి ఒక స్కూలుకు అడ్మిషన్ కోసం గురించి వెళ్తే ఫీజు చాలా చెప్పారు.ఎంత ఎక్కువ అంటే ఇంజనీరింగు ఫీజు కంటే ఎక్కువ చెప్పారు. ఎందుకు అంత ఎక్కువ ఫీజు అడుగుతున్నారంటే "ప్రజలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాము "ఇది స్కూలు వాళ్ల సమాధానం .అంటే విలువ పెంచింది ఈ నడమంత్రపు సిరి వాళ్ళే.

రోజున్న ఆర్ధిక మాంద్యానికి కూడా కారణం వీళ్ళే.వీళ్ళు ఆర్ధిక క్రమశిక్షణ పాటిమ్చకపోవడమే.





8, మే 2009, శుక్రవారం

దారి తప్పిన పెద్దపులి

ఒక పోరాటంలో ప్రజాస్వామ్య పంథా లేకుండా నిరంకుశంగా ఉంటే ఫలితం ,ఇవాళ శ్రీలంక లో తమిళుల పరిస్థితి ని చూసి తెలుసుకోవచ్చు.మితవాద తమిళ పార్టీ ల నాయకులను ,తనకు అడ్డం వచ్చిన ప్రతి నాయకుని చంపుకుంటూ పోయి ఇవాళ తమిళ టైగర్లు అతర్జాతీయ మద్దత్తును కోల్పోయారు.తమిళ ఉద్యమానికి వేల మంది తమిళ సోదరుల ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా శ్రీలంక లో తమిళుల న్యాయ సమ్మతమైన కోర్కె లను తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది.ఒక వేల ఎల్టి టి ఈ నేతృత్వంలో తమిళ దేశం వచ్చినా అది నియంతృత్వం లోకి జారు కొని ,అక్కడి తమిళ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి లోకి పడినట్లవుతుమ్ది.

కావున ఒక సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా చర్చలు తప్ప ఆయుధం కాదని చరిత్రలో మరో సారి ఋజువు అయ్యింది.

5, మే 2009, మంగళవారం

నిజమైన నాగరికత

ఈ మధ్యన మేము మా కుటుంబం తో కలిసి వారణాసి ,అలహాబాద్,అయోధ్య వెళ్లి వచ్చాము .మన దక్షిణ భారత దేశం ,ఉత్తర భారత దేశం తో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది అని మనం అనుకుంటూ ఉంటాము.కాని మనం నేర్చు కోవలసినవి చాలా ఉన్నవి.ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ గురించి.అక్కడ ప్లాస్టిక్ వాడకం చాలా తక్కువ.ముఖ్యంగా టీ,కాఫీ,లస్సి లు వాళ్లు మట్టి పాత్రలలో ఇస్తున్నారు .ప్లాస్టిక్ కప్పు లు అస్సలు కనబడలేదు.దీని వలన గ్లోబలైసేషన్ వలన కుంటుపడిన మన చేతి వృత్తులను కా పా డిన వాళ్లము అవుతాము.దీని వలన మట్టి పాత్రలు తయారి మీద ఆధారపడిన కుమ్మరులను ఆదుకున్నట్లవుతుది.
అభివ్రిద్ది అంటే సాఫ్టు వేరు ఉద్యోగాలు,కార్లు మాత్రమే కాదు.భవిష్యత్తు తరాలకు వీలైనంత స్వచ్చమైన ప్రక్రుతి ని మిగల్చడం కూడా .అప్పుడే మనకు నిజమైన నాగరికత ఉన్నట్లు.

11, మార్చి 2009, బుధవారం

వీళ్ళా మన పాలకులు

ఎల'క్షణాలు ' తిరిగి మొదలయ్యాయి.ఊరు వాడా అంతా హోరెత్తిస్తున్నారు.ప్రజాసేవ చేయడానికి పరుగులు పెడుతున్నారు.

కాని ఏ అభ్యర్థి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,పాత రౌడినో లేక ఖూనికోరో లేక అక్రమ వ్యాపారాలవలన కోట్లు సంపాదించినవాడో కనిపిస్తున్నాడు.వీళ్ళకు వోట్లు వేయాలంటే వెగటు పుడుతుంది. కాబట్టి వోటింగ్ యంత్రం లో ఇంకొక బటన్ పెడితే బాగుంటుంది.నిల్చిన అభ్యర్థులెవరూ ఇష్ఠంలేని వాళ్లు ఆ బటన్ నొక్కుతారు. మొత్తం వోట్లు లెక్కించిన తర్వాత కొంత శాతం వోట్లు ఇష్ఠం లేని బటనుకు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.ఆ ఇష్ఠం లేని అభ్యర్థులను కొన్ని సంవత్సరాలు ఎన్నికలలో పాల్గొనకుండా డిబార్ చేసి,ఆ ఎన్నికల ఖర్చును ఆ గుర్తింపు పొందిన పార్టీలనుండి వసూలు చేయాలి.

ఇలా చేస్తే పార్టీలు కొంచమైనా మంచివాల్లను తమ అభ్యర్థులుగా నిలబెడతాయి.ఇలాగైనా ప్రజాస్వామ్యం కొంతైనా మెరుగు పడవచ్చు.దీనిమీద ఎలెక్షన్ కమిషన్ దృష్టి పెడితే బాగుంటుంది.

8, మార్చి 2009, ఆదివారం

తల్లులార వందనాలు

అందరికి వందనాలు.
  • ఆడో ,మగో నిర్ణయించు కున్నాక పిల్లలను కనే పద్దతి మాను కుందాం.
  • భ్రూణ హత్యలను ఆపేద్దాం.
  • ప్రకృతి ప్రతిరూపమైన స్త్రీలను గౌరవిద్దాం.
  • ఆసిడ్ దాడులను ఆపేద్దాం,మరియు తీవ్రంగా ఖండిద్దాం.

మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.

6, మార్చి 2009, శుక్రవారం

చంద్రబాబు గారి ఉత్తుత్తి హామీలు

తినడానికి చేపలు ఇవ్వకుండా చేపలు పట్టే విధానం నేర్పించాలని ఒక నానుడి ఉంది.తెలుగుదేశం పార్టి వాళ్ళు ప్రజలను సోమరిపోతులలాగా మార్చాలని చూస్తున్నట్టున్నారు.ఐనా కానీ చంద్రబాబు గారి మాటలు ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు.ఆయన పరిపాలించినపుడు ఏం చేసారో ప్రజల మనో ఫలకం నుండి ఇంకా తొలగిపోలేదు.
ఇటువంటి సాధ్యం కాని హామీలను ఇచ్హి ఎలాగోలా అధికారానికి రావాలని ఆయన కలలు కంటున్నారు.
ప్రజలు చాలా తెలివైనవాళ్ళు.ప్రజలు మీరు ఇస్తే తీసుకునే భిక్షగాళ్ళు కారు.వాళ్ళు మీకు అధికారం ఇచ్హేది శాశ్వతమైన పథకాలు ఉదా:- విద్య,వైద్యం,స్థిరమైన ఆర్థిక పరిస్థితి కోరుకుంటారు.
కాబట్టి ప్రజలు నవ్విపోకుండా పద్దతి గల హామీలు ఇస్తే బావుంటుంది.

28, ఫిబ్రవరి 2009, శనివారం

రాజకీయ ప్రకటనలు

ఈ మధ్యన టివి లలో వస్తున్నా రాజకీయ పార్టీల ప్రకటనలను చూస్తుంటే సిగ్గు వేస్తుంది.ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటున్నారు.ఒకరి ప్రకటనలకు మరొకరు కౌంటర్లు ఇస్తూ అంతం లేకుండా పోయింది.

రాజకీయ పార్టీలు ప్రజల గురించి ఎవరూ పట్టించు కోవడం లేదు.వీళ్ళ ప్రకటనల వలన అనిమేషన్ చేసే వాళ్ల కు ,టీవీ వాళ్ల పంట పండింది.