14, డిసెంబర్ 2009, సోమవారం

ప్రజల మనసులను విష పూరితం చేయడం ఇంత సులభమా ?

భారత దేశం ,పాకిస్తాన్ లను తెల్లదొరలు విభజించినప్పుడు హిందూ ,ముస్లిముల మధ్యన మతకలహాలు చెలరేగి కొన్ని వేలమంది చని పోయారని చరిత్ర చదివినప్పుడు ,ఒకే దేశం లో ఉన్న ప్రజల మధ్యన ఒకరినొకరు చంపుకునేంతగా ద్వేషంఎందుకు వస్తుందో నాకు అంతగా అర్థం అయ్యేది కాదు.కానీ రాజకీయనాయకులు తలచుకుంటే అదేమీ పెద్ద విషయంకాదని ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థం అయ్యింది.తెల్ల దొరసాని చేసిన రాష్ట్రవిభజన ప్రకటన ఇంత వరకూ కలసి మెలిసిఉన్న తెలంగాణా ,ఆంధ్ర ప్రజల మనసులను విషపూరితం చేసినాయి.తెలంగాణా ఇచ్చినా లేకున్నా ఇరు ప్రాంతాల ప్రజలు మనసులను విషతుల్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది.

13, డిసెంబర్ 2009, ఆదివారం

ఈ వేర్పాటు ఉద్యమాలు ప్రజలను గొర్రెలను చేయడానికి రాజకీయనాయకులు పన్నిన కుట్ర.

ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ అయి పోయి జాతీయవాదం లేకుండా పోయింది.ఉదాహరణకు ఈ వాళ తమిళనాడు వాళ్ల కంటే మనకు ఎం.పిలు ఎక్కువ ఉన్నా మనకు కేంద్ర కాబినెట్ లో సరైన బెర్తులు దొరక లేదు.తమిళనాడు వాళ్ళది ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్లు బ్లాక్ మెయిల్ చేసి మంత్రుల ఫోర్టుఫోలియోలు గాని ,నిధులు ,పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ల రాష్ట్రానికి తరలించుకొని పోతున్నారు. చిన్న చిన్న బ్లాక్మెయిల్ లకు భయపడి రాష్ట్రాలను విభజించు కుంటూ పొతే దేశం చాలా ముక్కలు అయి పోయి దేశ సమగ్రతకే ముప్పు ఏర్పడుతుంది.ఇవాళ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది.మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను నిలదీసి అడగాలి,ఎందుకు వెనకబడి ఉన్నామో .అది చేతగానప్పుడు ఎన్ని రాష్ట్రాలు అయిన కూడా అభివృద్ధి అనేది ఏమీ జరగదు.అభివృద్ధి కోసం కొట్లాడాలి.ఈ వాళ తెలంగాణా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది.అప్పుడు పాలకులు వాళ్ల తప్పును కప్పిపుచ్చుకోవడానికి తిరిగి వేర్పాటు వాద ఉద్యమాలు మొదలు పెడుతారు.అప్పుడు ఉత్తర తెలంగాణా లేక దక్షిణ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని ఇంకొకరు వచ్చి ఉద్యమం మొదలు పెట్టి ప్రజలను తమ మౌళిక సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తారు.ఈ వేర్పాటు ఉద్యమాలు ప్రజలను గొర్రెలను చేసి వాళ్ల హక్కుల కోసం పోరాడకుండా డైవర్ట్ చేయడానికి ,వేర్పాటు ఉద్యమ నాయకులు ధనవంతులు అవ్వడానికి,కొన్ని రాజకీయ పదవులు పొందడానికి తప్ప ప్రజలకు మేలు చేయడానికి మాత్రం కాదని ప్రజలు గుర్తిస్తే చాలా మంచిది.

12, డిసెంబర్ 2009, శనివారం

రాజశేఖర రెడ్డి వర్గాన్ని చిన్నాభిన్నం చేసిన ముసలి నాయకులు.

రాజశేఖర రెడ్డి గారి అనుకూల వర్గ ఎం.ఎల్.ఎ ల లో తెలంగాణా అనే తేనెతుట్టె ను కదిపి విజయవంతంగా చీలిక తీసుకు వచ్చిన కాంగ్రెస్స్ అధిష్టానం.ఆ విధంగా జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కాంగ్రెస్స్ లోని ముసలి నాయకులు అధిష్టానం ద్వారా విజయవంతంగా దెబ్బ కొట్టినారు.

కే.సి.ఆర్ మరో నిజాం లాంటి వాడు.

తెలంగాణా లోని ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన నిజాం రాజును ,ఆ ఇబ్బంది పడిన ప్రజలు ఇంకా బ్రతికి ఉండంగానే పొగిడిన కే.సి.ఆర్.కు జై కొడితే నిజాం చెర నుండి తెలంగాణా ను విడిపించడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయని ఒక సారి తెలంగాణా బిడ్డలు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది.అటువంటి కే.సి.ఆర్. వలన తెలంగాణా వస్తే నిజాం రాజ్యం లోని పరిపాలన కంటే భిన్నంగా ఏమీ ఉండదు అని తెలంగాణా బిడ్డలు ఆలోచించాలి.తిరిగి రెండు జర్మనీలు ఏకీకరణం అయినట్లు ఏదో ఒక రోజు తిరిగి రెండు తెలుగు ప్రాంతాలు ఏకం కాక తప్పదు.

10, డిసెంబర్ 2009, గురువారం

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

కాంగ్రెస్స్ అధిష్ఠానం ప్రజలలో పలుకుబడి లేని,ప్రజల నాడి తెలియని నాయకుల (ఉదా:-వి.ఎచ్.,కే.కే.) మాటలు విని తెలంగాణాకు సై అని పప్పులో కాలేసింది.ప్రజలలో పలుకుబడి లేని కే.సి.ఆర్ లాంటి ఒక నాయకుడు నిరాహారదీక్ష అని బ్లాక్ మెయిల్ చేస్తే దానికి భయపడి ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సంసిద్ధం కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు.అదే కే.సి.ఆర్. తెలంగాణాకు చెందిన ఇతర కాంగ్రెస్స్ నాయకులను ఎలా తిట్టారో అప్పుడే మర్చి పొయినారా?జగన్ విషయం లో అధిష్ఠానం చెప్పిన నిర్ణయానికి కాంగ్రెస్స్ ఎం.ఎల్.ఎ లు తలోగ్గినట్లే ఈ విషయంలో కూడా వాళ్లు మాట వింటారని కాంగ్రెస్స్ అధిష్ఠానం అనుకొంది.ప్రజాభిప్రాయం తో సంభంధం లేకుండా అధిష్ఠానం అనే అహంకారంతో ,నిరంకుశత్వంగా వ్యవహరించి ఈ వాళ కొరివితో తల గోక్కున్నట్లు అయ్యింది.కే.సి.ఆర్ కు తిరుగులేని ప్రజా బలం ఉండి,తెలంగాణా వాదం ఉన్నప్పుడే వై.ఎస్. గారు ఆ సమస్యను చాలా తేలికగా తీసుకొని ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు.ఈ వాళ తెలంగాణ వాదం బలహీన పడి, టి.ఆర్.ఎస్. పార్టీ తన ఉనికి కోల్పోతున్నప్పుడు ఈ సమస్యను కాంగ్రెస్స్ అధిష్ఠానం పరిష్కరించలేక చేతులు ఎత్తి వేసే పరిస్థితి వచ్చింది.కావున కాంగ్రెస్స్ సీనియర్లకు ఈ వాళ అయినా తెలిసిరావాలి,రాష్ట్రంలో వై.ఎస్.ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్స్ అంటే వై.ఎస్.,వై.ఎస్. అంటే కాంగ్రెస్స్ అని.అధిష్ఠానం అంటూ ఏమీ లేదని.ఈ వాళ పరిస్థితి విడవ మంటే పాముకు కోపం,కరవ మంటే కప్పకు కోపం లా కాంగ్రెస్స్ అధిష్ఠానం పరిస్థితి అయ్యింది.

ఈ వార్త విని వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది.

ప్రజలలో నుండి వచ్చిన బలమైన నాయకుడు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాంతీయ వాదాల్ని ఒంటిచేత్తో ఆపగలిగాడు. తెలంగాణాకు రాజశేఖర రెడ్డి మాత్రమే అడ్డం అని ప్రచారం తో ఊదరగొట్టినా ,టి.ఆర్.ఎస్.,మిగతా పార్టీలన్నీ ఒక వైపు ఉండి ఎలెక్షన్లలో పాల్గొన్నా,అభివృద్ధి అనే నినాదంతో ఒంటి చేత్తో కాంగ్రెస్స్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ,టి.ఆర్.ఎస్. ను పది సీట్లకు మాత్రమే పరిమితం చేసి తెలంగాణావాదం ఏమీ లేదని తేల్చేశాడు.టి.ఆర్.ఎస్. పార్టీ కూడా అధినేత మీద విశ్వాసం లేక చిన్నాభిన్నమైనది.కానీ రాజశేఖర రెడ్డి గారు చని పోయిన తర్వాత చచ్చిపోయిన తెలంగాణా వాదాన్ని సెలైన్ ను పెట్టి తిరిగి బతికించి ఈ రోజు కేంద్రం తో తెలంగాణాకు సై అనిపించారు. ఈ పరిణామాల్ని చూస్తున్న రాజశేఖర రెడ్డి గారి ఆత్మ తీవ్రంగా క్షోభిస్తూ ఉంటుంది.

4, డిసెంబర్ 2009, శుక్రవారం

అభివృద్ధి అంటే ఒక చార్మీనార్ ,ఒక సాలార్జంగ్ మ్యూజియం కట్టడం కాదు

బ్రిటిష్ వాళ్లు మనలను పాలించేటప్పుడు వాళ్ళను తరిమి వేస్తే ప్రజలంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ,సుఖ సంతోషాలతో తులతూగుతారని ప్రజలంతా భ్రమ పడ్డారు.కానీ ఈ వాళ ఏమైంది.స్వాతంత్ర్యం వచ్చి అరవై సంవత్సరాలు పైబడింది.కానీ ఇప్పటికి కూడా కోట్ల మంది ప్రజలు ఒక్క పూట తిండికి కూడా నోచుకోకుండా ఉన్నారు.కనీసం రాజ్యాంగం కల్పించిన కనీస మౌలిక హక్కులు కూడా పొంద లేని పరిస్థితిలో ఉన్నారు.ఆ నాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళలో గాంధీజీ,భగత్సింగ్,సుభాష్ లాంటి నిస్వార్థ పరులు ఉండే వారు. కానీ ఈ వాళ తెలంగాణా విముక్తి కోసం పోరాటం చేస్తున్నానని చెబుతున్న కే.సి.ఆర్. లాంటి వ్యక్తుల విశ్వసనీయత ఎలాంటిదో ప్రజలకు తెలుసు.తెలంగాణా ఉద్యమం చేపట్టక ముందు కే.సి.ఆర్. ఆస్తి ఎంత ,ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత.ఈ వాళ తెలంగాణా రాష్ట్రం విడిపోయినా కూడా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.అక్కడ దోపిడీ ఉండదని ప్రజలకు హామీ ఇస్తారా? ఈ వాళ ఆంధ్ర ప్రజలను బూచిగా చూపించి తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న వారు ,తెలంగాణా వచ్చిన తర్వాత అమాయక తెలంగాణా బిడ్డలను దోచుకోరని గ్యారెంటీ ఉందా.ప్రతి సమాజంలో పీడించే వాళ్లు ,పీడితులు ఉంటారు.ప్రజలు మోసపోకుండా హుషారుగా ఉండాలి,అంతేగాని తెలంగాణా వచ్చినంత మాత్రాన ఆ రాష్ట్రంలో అందరూ ఉత్తములు ఉండరు.హైదరాబాదు ముందే ఎంతో అభివృద్ధి చెందిందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాతనే వెనక పడినామని చెబుతున్నారు.అభివృద్ధి అంటే ఒక చార్మినార్,ఒక సాలార్జంగ్ మ్యూజియం కట్టడం కాదు.ప్రజలకు తగిన విద్యాబుద్దులు ఉండి వాళ్ల బతుకులు వాళ్లు బతికే విధంగా చేయడం.కానీ ఈ రోజుకు కూడా తెలంగాణా లోని ప్రజలు ఎంతో అమాయకంగా ,రకరకాల మూఢ నమ్మకాలలో బతుకుతున్నారు.ఎవరో వచ్చి వాళ్ళను మోసం చేస్తారని భ్రమల్లో ఉన్నారు.వాళ్ల మీద వాళ్లకు నమ్మకం లేదు.కావున ఎంత అభివృద్ధి చెందిందో ,మేము ముందే అభివృద్ధి చెంది ఉన్నామని చెప్పే తెలంగాణా మేధావులు జవాబు చెబితే బాగుంటుంది.తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు ఏదో ఒరిగి పోతుందని చెప్పి తెలంగాణా ప్రజలను ఎండమావుల వెంట పరిగెత్తించేది మానుకుంటే బాగుంటుంది.

3, డిసెంబర్ 2009, గురువారం

కే.సి.ఆర్ కంటే బాలాథాక్రే చాలా నయం

తెలంగాణా అనే భావోద్వేగ సమస్యని తెలంగాణా లోని రాజకీయ నాయకులు చాలా బాగా క్యాష్ చేసుకుంటున్నారు.మొదట చెన్నారెడ్డి ఆ సమస్యను ఉపయోగించుకొని అనేక పదవులు పొందినారు.ఇప్పుడు కె.సి.ఆర్. అదే పనిలో ఉన్నారు.ఒక వైపు ఏమో చచ్హేంత వరకు నిరాహారదీక్ష అంటున్నాడు, మరోవైపు ఏమో ఖమ్మంలో సౌకర్యాలు లేవంటున్నాడు.చచ్హేవానికి సౌకర్యాలతో ఏం పని.దీన్ని తెలంగాణా ప్రజలు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ ప్రజలు.ఎందుకంటే తెలంగాణా వాళ్ళు కలుస్తామంటే కర్నూలు రాజధానిని పోగొట్టు కొని హైదరాబాదు రాజధానిని ఒప్పుకున్నారు.హైదరాబాదు బాగా అభివ్రుద్ది చేసు కున్న తర్వాత తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు.నాకు తెలిసినంత వరకు రాజధాని వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ రాష్ట్ర విభజన కోరలేదు,తెలంగాణా వాళ్ళు తప్ప.తెలంగాణా వాళ్ళ కంటే బాలాథాక్రే చాలా నయమని పిస్తుంది.ఎందుకంటే ఆయన ముంబాయి మరాఠీ లది మాత్రమే అంటున్నాడు.కానీ ఇక్కడ ఆంధ్రావాలే భాగో అంటున్నారు.తెలుగువాళ్ళం అయి ఉండి తెలంగాణా ప్రాంతంలో ద్వితీయ శ్రేణి పౌరులులాగా భయపడుతూ ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు.తెలంగాణా ఉద్యమానికి నిధులు పంపిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రవాస తెలంగాణా ప్రజలూ మీరు ఒక సారి ఆలోచన చేయాలి.ఎందుకంటే అక్కడి ప్రజలు మిమ్ములను కూడా భాగో అనే పరిస్థితి వస్తుంది.

1, డిసెంబర్ 2009, మంగళవారం

మళ్ళీ విజయవంతంగా దీక్ష ను ముగించిన కే.సి.ఆర్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకముందే బి.జే.పి తో పొత్తుకు సై చెప్పిన కే.సి.ఆర్. ఆ పార్టీ అధికారం లోకి రాక పోయేసరికి ,కాంగ్రెస్స్ తో దగ్గర కావడానికి నిరాహార దీక్ష అనే కొత్త పథకం రచించాడు.ఇలాంటి పథకాలు వేస్తే కాంగ్రెస్స్ పార్టీ దగ్గరకు తీసుకొని కేంద్రం లో ఏదో ఒక పదవి ఇస్తుందని ఆయన ఆశ పడి దీక్ష డ్రామా మొదలు పెట్టినాడు.మునుపటి లాగే దీక్ష డ్రామా లానే ముగిసింది.మళ్ళీ కే.సి.ఆర్. విజయవంతంగా దీక్షను ముగించాడు.