23, డిసెంబర్ 2012, ఆదివారం

తెలుగు మాట్లాడ్డం నామోషి అయ్యింది!ఇంకెక్కడ తెలుగు !

తిరుపతి లో తెలుగు మహా సభలు జరపడానికి ప్రభుత్వం సన్నద్దమవుతున్నది .కానీ అదే చిత్తూరు జిల్లా నుండి వచ్చి ఈ మధ్యన  బెంగుళూరులో స్థిరపడిన ప్రజలు చాలా మంది ఇంట్లోనూ మరియు వారి ఊర్లకు వెళ్ళినప్పుడు తమలో తాము కన్నడం లో మాట్లాడుతామని చెబుతారు.వీళ్ళు కన్నడం లో మాట్లాడుతుంటే వాళ్ళ ఊర్ల లోని ప్రజలు నోర్లు తెరుచుకొని చూస్తుంటే వీళ్ళకు అది ఒక గొప్ప.ఇంట్లో పిల్లల తో కూడా వాళ్ళు  చాలా మంది కన్నడం లోనే మాట్లాడతారు.మా పిల్లలకు అస్సలు తెలుగు మాట్లాడడం రాదు అని గొప్పగా చెప్పే వాళ్ళు ఉన్నారు.ఇది నాణానికి ఒక వైపు.కానీ ఇదే బెంగుళూరు లో ఉన్న కొన్ని కుటుంబాలు కొన్ని తరాల నుండి  ఇక్కడే ఉన్నాయి.వాళ్ళ పెద్దలు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో ,ఎక్కడ నుండి వచ్చారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం స్పష్టమైన తెలుగులో మాట్లాడతారు.కోలారు జిల్లా కు చెందిన కొత్త దేవరు వక్కలిగులు (గౌడ లు)కూడా  చాలా మంది  అచ్చ తెలుగులో మాట్లాడతారు.అలాగే తమిళనాడులోని హోసూరు కు మరియు కృష్ణగిరి జిల్లాలకు చెందిన  వాళ్ళు,అలాగే బెంగుళూరుకు శివారులో ఉన్న అత్తిబెలె,అనేకల్ ,జిగిని ప్రాంతాల వాళ్ళు కూడా  తెలుగును నిలబెట్టుకున్నారు.చివరికి వీళ్ళు మాట్లాడేటప్పుడు  ఊర్ల పేర్లు కూడా తెలుగులోకి అనువాదం చేసి చెబుతారు.ఉదాహరణకు హోసోరును కొత్తూరని,హొసకోటను కొత్తకోటని,హొసహళ్లి ని కొత్తపల్లి అని  చెబుతారు.ఒక సారి నేను బెంగుళూరు శివారు ప్రాంతమైన హొసహళ్లి కి పోవలసి ఉంది.ఆ ప్రదేశానికి వెళ్లి హొసహళ్లి  కి దారి అడిగితే కొత్తపల్లి కి  ఇలా పోవాలి అని చెప్పారు.అదేంటి నేను హొసహళ్లి కి దారి అడిగితే కొత్తపల్లికి దారి చూపిసున్నారని కొంచం సేపు తిక మక పడ్డాను,తర్వాత అర్థం అయ్యింది వాళ్ళు చూపించింది నేను అడిగిన ఊరికే అని.కన్నడం లో హొస  అంటే  కొత్త అని,హళ్లి అంటే పల్లి అని అర్థం.అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.
                    ఇంకా ఒక ఒక ముఖ్యమైన విషయం ఏమంటే బెంగుళూరులో ఒక రోడ్డుకు వేమన పేరు ఉంది.వేమన జయంతి ఉత్సవాలు ఇక్కడ ,హోసూరు లో ఘనంగా చేస్తారు.కానీ మన దగ్గర వేమన గురించి ఎవరూ పట్టించు కునే వారే లేరు.మన వాళ్లకు తెలుగులో మాట్లాడడం చాలా నామోషి అయ్యింది.మన పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళలో వేసి అలా తెలుగు రాకుండా పోయి,ఇటు ఇంగ్లీషు రాక రెంటికీ చెడిన రేవడులు  అయ్యారు.ఆంధ్ర దేశం లో ఉన్న వాళ్ళ కంటే బయట ఉన్న వాల్లే తెలుగును బాగా కాపాడు కుంటున్నారు. తెలుగు భాష కలకాలం వర్థిల్లాలని కోరుకుంటూ .....

22, డిసెంబర్ 2012, శనివారం

రేప్ చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి కానీ...

డిల్లీ లో రేప్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి.శిక్షలు ఎలా ఉండాలంటే ,తిరిగి అటువంటి నేరం చేయాలనే తలంపు ఎవరికీ రాకూడదు. అందులో మరో ప్రశ్నకు తావు లేదు.రేప్ కు గురైన బాధితురాలు బాధ వర్ణనాతీతం.ఆమెకు ఏం చేసినా తక్కువే . కానీ హిపోక్రసి లేకుండా ప్రజలు ఒకటి ఆలోచించ వలసిన అవసరం ఏర్పడింది.ఈ మధ్య కాలం లో సెల్ ఫోనులు మరియు ఇతర సోషియల్ నెట్వర్కులు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ చాలా పెరిగి కొన్ని అనర్థాలు కూడా పెరిగాయి.పూర్వం ప్రేమ అనే పదానికి చాలా పవిత్రత ఉండేది.కాని నేడు దాని అర్థం చాలా కుచించు కొని పోయింది.తమ శారీరక అవసరాలు తీర్చుకొనడానికి కూడా ప్రేమ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు.ఇలాంటి ప్రేమికులు తాము మేజర్లము అయినామని తమకు అన్నీ తెలుసనీ వారి ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు.ఆ పనులు నాలుగు గోడల మధ్యన చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.కానీ ఈ మధ్యన వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు బహిరంగ ప్రదేశాలలో చేస్తున్నారు (ఉదా:బస్సులలో ,ఆటోలలో పబ్లిక్ పార్కుల్లో ,చివరికి దేవాలయాల్లో కూడా ...).ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు,చివరికి వాళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నారు .పబ్లిక్ పార్కులకు పిల్లలను తీసికెళ్ళా లంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇవి చూసిన కొంత మంది యువకులు ఆ అబ్బాయిని కొట్టి ,అ అమ్మాయిని రేప్ చేసిన సందర్భాలు చాలా వరకు మనం నిత్యం పేపర్లలో చూస్తున్నాము.కొన్ని తమ పరువు పోతుందని మీడియాకు ,పోలీసులకు తెలపని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.పార్కుల్లో శృంగారం,వెకిలి చేష్టలు చేస్తున్న  వాళ్ళను శిక్షించడానికి పోలీసులు వెలితే సదరు ప్రేమికులు తమకు  ప్రేమించే  హక్కు ఉందని ,తమ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని హక్కుల సంఘాల కార్యకర్తల తో కలిసి తీవ్రమైన నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి.ఇటువంటి వాళ్ళను ఎవరు శిక్షించాలి.కావున ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత  రోడ్ల మీదికి వచ్చి గొంతు చించుకునే బదులు అటువంటి వాటికి వీలైనంత వరకు అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది.

12, డిసెంబర్ 2012, బుధవారం

తప్పులు ఎంత చేస్తే అంత డబ్బులు వస్తున్నాయి!

ఈ మధ్యన ఊర్లలో వ్యవసాయ భూముల వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు.అందులో చాలా తప్పులు దొర్లుతున్నాయి.వాటిని సరిదిద్దుకొనడానికి  రైతులు నానా పాట్లు పడుతున్నారు.ఇప్పుడే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఈ తప్పులను సరిచేసుకోవడానికి తమ పనులు విడిచి పెట్టి పలుమార్లు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగ వలసి వస్తున్నది.కంప్యూటర్లో వాళ్ళే తప్పులు నమోదు చేసి ,సరిదిద్దమని రైతులు వెళితే డబ్బులు డిమాండ్ చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కంప్యూటర్లో నమోదు చేయు వాళ్ళు చాలా చోట్ల అవుట్  సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.వీళ్ళు తప్పులు ఎంత చేస్తే అంత డబ్బులు వస్తున్నాయి.ఇక్కడ తప్పుకు శిక్ష లేదు.రివార్డులు వస్తున్నాయి.అటువంటప్పుడు వాళ్ళు బాధ్యతగా ,సరిగా ఎందుకు చేస్తారు.తమ భూమి రికార్డ్ లో తప్పు ఉందని  రైతు అప్లికేషన్ తో  వచ్చిన ప్రతిసారి ,ఒక్కో తప్పుకు ఇంత అని పనిచేసే వాళ్ళ  జీతములో కోత  పెడితే  అప్పుడు పనులు సరిగా చేస్తారు .ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి.లేక పొతే కావాలనే కంప్యూటర్లో తప్పులు ఎక్కువ నమోదు  చేస్తారు.

23, నవంబర్ 2012, శుక్రవారం

బెంగుళూరు లో బాడుగ ఇంటిలో ఉన్న బాధలు అన్నీ ఇన్నీ కావు..

బెంగుళూరు లో ఇండ్లు బాడుగకు తీసుకోవడంలో ఉన్న బాధలు అన్నీ ఇన్నీ కావు.ఎక్కడ లేని విధంగా పది నెలల అడ్వాన్సు ఇవ్వ వలసి ఉంటుంది.ఇండ్లు వెతికి పెట్టిన ఏజెంట్ కు ఒక నెల బాడుగ ఇవ్వాలి.ఇంతా చేస్తే వాళ్ళు అగ్రిమెంటు రాసేది 11 నెలలకు మాత్రమే .ఆ తర్వాత వాళ్లకు ఇష్టం అయితే 10 శాతం పెంపు దలతో అక్కడ ఉండ  వచ్హు .లేకుంటే తిరిగి ఇళ్ళ వెతుకులాట కొనసాగించాలి.వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇంటికి రంగులు వేయించడానికి ,ఏవైనా కుళాయిలు  (taps) పొతే (దానికి కాలం తీరి పోయినా సరే) అన్నింటికి మన అడ్వాన్సు డబ్బులు పట్టుకుని చేయించుకుంటారు.ఇంటి యజమానులు వాళ్ళ ఇంటికి 5 సంవత్సరాలకు  ఒకసారి  కూడా రంగులు వేయించ కున్నా బాడుగ ఇళ్ళకు మాత్రం ప్రతి సంవత్సరం రంగులు వేయిస్తారు.ఎందుకంటే  సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.సొమ్ము బాడుగ వాళ్ళది,సోకు ఇంటి యజమానులది.దీనివలన బెంగుళూరు లో రంగులు కొట్టే  పని వాళ్లకు ,బాడుగ వాహనాలు పెట్టుకున్న వాళ్లకు  చాలా డిమాండ్ ఉంది,ఇదే పనిగా జీవనం సాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.బెంగుళూరు లో ఒక సారి ఇల్లు మారాలంటే  కనీసం 30 వేల రూపాయల ఖర్చు వస్తుంది .అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు  అన్నీ ఒక వైపే ఉంటాయి.అన్నీ ఇంటి యజమానులకు అనుకూలంగా ఉంటాయి.చాలా సందర్భాలలో బాడుగకు ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ అడ్వాన్సు ఇవ్వకుండానో  లేక అందులో చాలా మటుకు దానికో ,దీనికో అని పట్టుకొని  సతాయించిన సందర్భాలు చాలా ఉన్నాయి.


22, నవంబర్ 2012, గురువారం

డోలు వచ్చి మద్దెలతో చెప్పుకున్నట్లు ఉంది !

ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పాద యాత్రలు మొదలు పెట్టి ,ప్రజల చెంతకు పోయి వాళ్ళ సమస్యలు వినే  బదులు  తమకు  కాళ్ళు బొబ్బలె క్కినాయని నాయకులు  తమ సమస్యలు చెబితే ప్రజలేం చేయాలి,కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంట్లో కూర్చోమని చెప్పడం తప్ప !



13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు .ఈ దీపావళి వాళ్ళ జీవితాలలో సరికొత్త  వెలుగులు  నింపాలని ఆశిస్తూ ....

11, నవంబర్ 2012, ఆదివారం

మన ఆహారం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము!

చాలా మంది సినిమా వాళ్ళను మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ  చేసేటప్పుడు  ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది.అదేమంటే మీకు ఏ ఆహారం  అంటే ఇష్టం అని ,అప్పుడు చాలా మంది చెప్పే జవాబు వాళ్లకు ఇటాలియన్ ,మెక్సికన్ ,కాంటినెంటల్  ఆహారం అంటే ఇష్టం అని చెబుతారు.అదేంటో నాకర్థం కాని విషయం ,వాళ్ళు చిన్నప్పటి నుండి అదే తిని బ్రతుకు తున్నట్లు చెబుతారు.తాము చిన్నప్పటి నుండి తిన్న రోటీ ,కూరలు ,అన్నం గురించి చెప్పనే చెప్పరు .సాధారణంగా మనం చిన్నప్పటి  నుండి   తినే ఆహారానికే మన నాలుక మీద ఉండే రుచి మొగ్గలు అలవాటు పడి ఉంటాయి.వేరే ఆహారం ఏది తిన్నా అది మనం ప్రతి రోజూ తినలేము,అది మనకు ఇష్టం కాదు.వీళ్ళందరినీ చూసి ప్రతి అడ్డమైన వాళ్ళు కొంచం ఇంగ్లీషు మాట్లాడడం వస్తే చాలు వాళ్ళు కూడా పిజ్జా లు ,బర్గర్లను గురించి మనది కాని ఆహారం గురించి వావ్ అంటూ గొప్పగా చెబుతూ ఉంటారు.ఎంతో ఆరోగ్య కరమైన మన ఆహారం గురించి చెప్పాలంటే వీళ్ళకు నామోషి.వాళ్లకు కూడా తెలుసు తాము తమ ఆత్మ ద్రోహం చేసుకొని చెబుతున్నామని,కానీ ఫాల్స్ ప్రిస్టేజి కి పోతున్నారు. మనం తినే ,మనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. ఈ మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్లకు ఇది మరీ ఎక్కువైంది.


8, నవంబర్ 2012, గురువారం

భారతదేశం నడిచే వాళ్లకి స్థానం లేనంతగా అభివృద్ధి చెందింది!

ఈ మధ్యన పెద్ద పెద్ద పట్టణాలలో నడిచే వారికి దారి ఉండడం లేదు.రోడ్లు కార్లు మరియు బైకులతో కిక్కిరిసి ఉంటున్నాయి.నడవడానికి కొంచం కూడా జాగా ఉండడం లేదు.పాదచారులు నడవడానికి ఉద్దేశించిన ఫుట్ పాత్  లు చాలా చోట్ల ఉండడం లేదు,ఒక వేల ఉంటే వాటిని అక్కడ ఉన్న దుఖానాల వారు తమ వస్తువులను ఉంచుకోవడానికి ,పార్కింగ్ కోసం ఉపయోగించు కుంటున్నారు.భారతదేశం  నడిచే వాళ్లకి స్థానం లేనంతగా అభివృద్ధి చెందింది.

8, అక్టోబర్ 2012, సోమవారం

ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది

రెండు దెబ్బల సమ్మెట పోట్లకే ప్రజలు 1000 రూపాయలు ఇస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది.ఇంకా పాద యాత్రలు ఎందుకు పరామర్శించడం  ఎందుకు?ప్రజల దగ్గర డబ్బులు గల గల లాడు తుంటే ?

23, ఆగస్టు 2012, గురువారం

మంత్రుల మీద వెచ్చించిన ప్రజల సొమ్మును రికవరీ చేయాలి

అన్నీ ముఖ్యమంత్రిగా వై.ఎస్. ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లే సంతకాలు చేసామని ,తమ కేమీ తెలియదని తాము అమాయకులమని ఇప్పుడు మంత్రులు చెబుతున్నారు.అటువంటప్పుడు మంత్రివర్గం ఎందుకు? మంత్రులకు అధికార బంగళాలు ,ఎర్ర బల్బు కార్లు,పి . లు,పి.ఎస్ లు ఇతర సిబ్బంది ని ప్రజా ధనాన్ని ఉపయోగించి ఇవ్వడం ఎందుకు?ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు ? ముఖ్యమంత్రి పదవి ఒకటి ఉంటే సరిపోతుంది కదా!! వాల అలా అంటున్న మంత్రుల మీద సమయంలో ఖర్చు పెట్టిన ప్రజా ధనాన్ని రికవరీ చేస్తే తప్పవుతుందా?

సాఫ్ట్ వేర్ మరియు బి.పి.ఓ కంపెనీలు పెద్ద సిటీ ల్లో ఉండడం అవసరమా?

సాఫ్ట్ వేర్ కంపెనీలు ,బి.పి. కంపేనీలు పెద్ద పెద్ద సిటీ ల్లో ఉండడం అవసరమా? సాధారణంగా వస్తూత్పత్తి చేసే సంస్థలకు ముడిసరకు రావడానికి ,తయారైన వస్తువులు రవాణా చేయడానికి రవాణా సదుపాయాల కోసం పెద్ద పట్టణాలలో పెట్టినారు.కానీ సాఫ్ట్ వేర్ మరియు బి.పి. కంపెనీలకు మనుష్యులు ,కంప్యూటర్ లు మరియు ఇంటర్నెట్ సదుపాయాలూ ఉంటే చాలు కదా?ఇవన్నీ ఇచ్చి అనంతపురం లాంటి జిల్లాల్లోని పల్లెల్లో ని బీడు భూముల్లో సంస్థలు నెలకొల్పి అక్కడే ఉద్యోగస్తులకు వసతి కల్పించ వచ్చు కదా?దీని వలన సిటీ మీద ఒత్తిడి తగ్గి ,ట్రాఫిక్ సమస్య ,మౌలిక వసతుల సమస్యలు అన్నీ తొలిగి పోతాయి కదా? చుట్టూ పక్కల పల్లెలు కూడా చిన్న చిన్న వ్యాపారాల వలన వృద్ది చెందుతాయి కదా? విధంగా అన్ని జిల్లాల్లోని బీడు భూములను గుర్తించి సంస్థలను నెలకొల్పితే బావుంటుంది కదా? విధంగా చేస్తే పెద్ద సిటీ ల్లో స్థిరాస్తుల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి.

13, ఆగస్టు 2012, సోమవారం

ప్రమోషన్లలో రిజర్వేషన్లు అవసరమా??

అంతవరకూ నీ కంటే జూనియర్ అయిన,నీ కంటే తక్కువ స్థాయి లో ఉన్న ఉద్యోగి,అంత వరకూ నిన్ను సార్.. సార్.. అని సంభోధించిన ఉద్యోగి విధమైన డిపార్టుమెంటల్ టెస్ట్ లు రాయకుండా , విధమైన ఉన్నత చదువు చదవకున్నా తెల్ల వారేసరికి నీకు అధికారి అయి పోతాడు.అప్పటి వరకూ నిన్ను సార్ అన్న వ్యక్తిని అప్పటి నుండి నీవు సార్ అని అతని ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి,ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇస్తే ఉంటుంది. పరిస్థితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో ఉంది.తన కన్నా చాలా జూనియర్ అయిన వ్యక్తులు తన ముందే 4 ,5 ప్రమోషన్లు తీసుకొని ముందుకు పోతా ఉంటే తానూ మాత్రం అదే ఉద్యోగం లో రిటైర్ కావలసిన పరిస్థితి. పరిస్థితి వలన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్యన సామరస్య మైన వాతావరణం పోయి,పని చేసే సంస్కృతి తగ్గి పోయి క్రమశిక్షణ లోపించింది.O.C. ఉద్యోగులు ఎలాంటి ప్రోత్సాహకాలు లేక చాలా ఆత్మా న్యూనతా భావంతో పనులు చేస్తున్నారు.ఆర్థికంగా ,సామాజికంగా బలం చేకూర్చడం కోసం S.C.,S.T. కు మరియు మిగతా కులాల వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చినారు బాగానే ఉంది.కానీ ప్రభుత్వ సాయం ఏమీ లేకుండానే ఆర్థికంగా వెనక బడిన అగ్రవర్ణాలు అనబడే వారి పిల్లలు కష్టపడి ప్రభుత్వోద్యోగం తెచ్చుకుంటే ,ఉద్యగం లో చేరిన తర్వాత తార తమ్యాలు ఎందుకో అర్థం కావడం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎందుకో అర్థం కావడం లేదు.పాలకులు తమ ఓట్ల వేట కోసం క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసు కోకుండా ఇలా చేసుకుంటూ పోతా ఉంటే ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి పోతాయి. ఇలాగే కొన సాగితే కొన్ని రోజుల తర్వాత అగ్రవర్ణాల వారిని ఆర్థికంగా , సామాజికంగా పైకి తీసుకు రావడానికి వారికి రిజర్వేషన్లు అమలు చేయ వలసిన పరిస్థితి వస్తుంది.

2, ఆగస్టు 2012, గురువారం

లక్షలు ,వేలు ర్యాంకులు వచ్చిన వాళ్లకు ఫీజు రీ ఇంబర్సుమెంట్ అవసరమా ?

వేలు ,లక్షలు ర్యాంకులు వచ్చిన వారికి ,చివరికి ఎంసెట్ లో పాస్ మార్కులు రాని వారందరికీ ఫీజు రీ ఇంబర్సుమెంట్ అవసరమా?ఎంసెట్ ర్యాంకులలో 5000 లోపు వచ్చిన వాళ్లకు లేక ఏదో ఒక కటాఫ్ పెట్టాలి. దానివలన నిజంగా ప్రతిభ ఉండి,ఆర్ధిక పరిస్థితి సహకరించని వారికి ఇది ఉపయోగ పడి,ప్రతిభను కూడా ప్రోత్సహించిన వారవుతారు.లేకుంటే ప్రజల సొమ్మును ఇలా చదువురాని వాళ్లకు ఖర్చు పెట్టి వాళ్ళను సోమరి వాళ్ళగా తయారు చేసి ,సమాజానికి పనికి రాకుండా చేసి,వ్యవసాయదారులకు కూలి వాళ్ళు దొరక్కుండా చేసి మన సమాజం సర్వనాశనం అవుతున్నది.ప్రభుత్వాలు విషయం లో పునరాలోచించాలి.

18, జులై 2012, బుధవారం

పార్టీలకు ఓటు విలువ గురించి చెప్పే నైతిక అర్హత ఉందా??

టి.డి.పి పార్టీ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యంగా ఉంది.ఒకప్పుడు సాధారణ ఎన్నికలల్లో పోలింగ్ శాతం తగ్గినప్పుడు చాలా పార్టీలు టి.డి.పి తో సహా ఓటు విలువ ఓటర్లకు తెలియదని ,ఓటు గురించి,ప్రజాస్వామ్యం గురించి చాలా ప్రసంగాలు చేసినాయి.మరి ఇప్పుడేమి అయ్యిందో అర్థం కావడం లేదు. చెప్పేదొకటి చేసేదొకటా?తమ ఓట్లు వేసి గెలిపించిన టి.డి.పి ఎం.పి లు,ఎమ్మెల్లే లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించక పొతే , సామాన్య ఓటరు పరోక్షంగా తమ రాష్ట్రపతి ని ఎన్నుకునే అవకాశం కోల్పోయినారు. పార్టీ లు తమ రాజకీయ అవసరాలకోసం ఒక్కక్క సారి ఒక విధంగా పిలుపు ఇవ్వకూడదు.రేప్పొద్దున ఎన్నికలమీద నిరాసక్తత కలిగి సామాన్య ఓటర్లు ఓటు హక్కు వినియోగించక , పోలింగ్ శాతం తగ్గితే పార్టీ లు ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకొమ్మని పిలుపు ఇచ్చే నైతిక హక్కు ఉండదు.చాలా సార్లు కొన్ని విప్లవ పార్టీ లు ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిస్తే వారిని ప్రజాస్వామ్య వ్యతిరేకులని ఇవే పార్టీ లు విమర్శించాయి. ఇప్పుడు సామాన్య ఓటరుకు పార్టీ మీద కూడా అదే అనుమానం వచ్చే ప్రమాదం వుంది.

12, జులై 2012, గురువారం

నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా??

వేరే మీడియా మరియు పేపర్ లేనప్పుడు ఒక వర్గం మీడియా మరియు పత్రికలు తయారు చేసిన నాయకుని నాయకత్వ లక్షణాల పై ఇపుడిపుడే ప్రజలకు భ్రమలు తొలగి పోతున్నాయి.ఒక వ్యక్తి తన వ్యక్తిగత సంభంధాలలో భాగంగా ఇంకో పార్టీ లో వ్యక్తిని కలిస్తే అతని దిష్టి బొమ్మలు తగలబెట్టడం ,అతని మీదికి తిరగ బడాలనడం ,సంజాయిషీ కోరకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో భాగం?తన పార్టీ మీద ,తన నాయకత్వ లక్షణాల మీద తనకున్న నమ్మకం పాటిదో అర్థం అవుతూ ఉన్నది.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు వై.ఎస్. తో ఎంతో సన్నిహితంగా మెలిగిన బూరగడ్డ వేదవ్యాస్ లాంటి వాళ్ళు పార్టీ మారతానని చెప్పినప్పుడు వై.ఎస్ గారు చాలా హుందాగా ప్రవర్తించారు. రోజు దిష్టి బొమ్మలు తగలబెట్టించి ,తిరగబడాలని చెప్పలేదు.అదీ తన నాయకత్వం మీద నాయకునికి ఉండాల్సిన నమ్మకం.తన నాయకత్వం మీద తనకే నమ్మకం లేకుంటే ఇంక పార్టీ కార్యకర్తలు నాయకుని మీద నమ్మకం పెట్టుకొని పార్టీ లో ఉండాలి .దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది తాము నిజమైన నాయకులము కాదని తమ, అనుకూల మీడియా తయారు చేసిన నాయకులమని!!

3, జులై 2012, మంగళవారం

హిందూ అరబిక్ నంబర్లు పోస్ట్ లో రావాలంటే ఏం చేయాలి!!

బ్లాగు లో పోస్ట్ వ్రాసేటప్పుడు నంబర్లు వ్రాస్తే నంబర్లు కూడా తెలుగువే వస్తున్నాయి.హిందూ అరబిక్ నంబర్లు రావాలంటే ఏం చేయాలి.దయచేసి బ్లాగు మిత్రులు తెలపగలరు.

30, జూన్ 2012, శనివారం

మా నానమ్మకు ఎంసెట్ ర్యాంకు వచ్చింది!

నిన్న ఎంసెట్ రిసల్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన చాలా మందిని మార్కులు ఆడిగితే వాళ్లకు ముప్పై అయిదు శాతం(ఏభై ఆరు మార్కులు ) కూడా రాలేదు. కానీ రాంకులు మాత్రం ముప్పై నాలుగు వేల నుండి పైకి వచ్చినాయి.నేను క్యూరియాసిటీ తో చదువు రాని మా నానమ్మకు కళ్ళు మూసుకొని అన్నీ ఒకే నంబర్ పెట్టుకుంటూ పొమ్మని చెబితే ముప్పై ఆరు మార్కుల నుండి నలభై ఏడు మార్కులు వచ్చినాయి.ఇన్ని సంవత్సరాలు చదివినారు కాబట్టి వాళ్లకు మా నానమ్మ కంటే పది మార్కులు మాత్రం ఎక్కువ వచ్చినాయి.ఇటువంటి వాళ్ళు అందరూ ఇంజినీరులై ఏం ఉద్దరిస్తారు.ఇలా మార్కులు వచ్చినా కూడా సీట్లు ఇంకా మిగిలి పోతా ఉన్నాయి.ఎంసెట్ విద్యావిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం అవుతూ ఉంది.

29, జూన్ 2012, శుక్రవారం

అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం జరిగిందా?జరగలేదా?

మొన్న ఒక ప్రముఖ తెలుగు చానల్ అమెరికా లో అమితాబ్బచ్చన్ కు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైనాయని పదే పదే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది.వేరే చానల్ వాళ్ళెవరూ ఇవ్వలేదు.తర్వాత రోజు పేపర్ లోనూ ఇది రిపోర్ట్ కాలేదు. ఇది నిజమా కాదా?ఒక వేల నిజం కాకుంటే చానల్ ఖండన కూడా నేను చూడ లేదు.ఏది నమ్మాలి .

28, మే 2012, సోమవారం

అప్పుడు ఎందుకు సినిమాలు తీసినారు ?ఇప్పుడు ఎందుకు తీయడం లేదు?

రాజశేఖరరెడ్డి గారు అధికారం లో ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా లబ్ది పొంది కుమారుని కంపెనీలలో పెట్టుబడి పెట్టినారని జగన్ మీద ఆరోపణ.అప్పుడు పెట్టుబడి పెట్టినారు ఇప్పుడెందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు హరికృష్ణ ను హీరో గా పెట్టి సినిమాలు తీసినారు,ఇప్పుడెందుకు తీయడం లేదు అంటే ఏమి చెప్పాలి. అలా లాజిక్ లు తీసు కుంటూ పొతే అంతం ఉండదు.

12, మే 2012, శనివారం

పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలందరూ నైతికంగా వ్యాపారాలు చేసి పైకి వచ్చారా?

ఇప్పుడు మన దేశం లో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్త లని మనం ఘనంగా ,గర్వంగా చెప్పుకుంటున్న వాళ్ళు అందరూ చాలా చిన్న స్థాయి నుండి వచ్చినవారే. ప్రపంచంలోని ధనవంతులలో మన వాళ్ళు ఇన్నో స్థానంలో ఉన్నారు,అన్నో స్థానంలో ఉన్నారు,అని మన దేశం లోని వాళ్ళు ఉప్పొంగి పోతుంటారు.మనదేశం లోని వాళ్లైనా ,ఇతర దేశం లోని వాళ్లైనా పారిశ్రామిక వేత్తలు రాజకీయ నాయకుల లేక బ్యూరోక్రసీ యొక్క అండదండలు లేకుండా ఇంత స్థాయి కి వచ్చేవారా? బడా పారిశ్రామిక వేత్తల కోసం ప్రభుత్వాలు చట్టాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి.అవన్నీ రాజకీయ నాయకులు ,బ్యూరోక్రాట్లు తమ స్వలాభం మానుకొని చేసి ఉంటారా? పారిశ్రామిక వేత్తలు రాజకీయాలలోకి రాలేదు.అందువలన వాళ్ళు పొందేది వాళ్ళు పొందుతూ వీళ్ళకు ఇచ్చేది వీళ్ళకు ఇచ్చి ఆనందంగా ఉన్నారు.అంత నైతికంగా వ్యాపారాలు చేస్తే పారిశ్రామిక వేత్త ఎవరూ అంత పెద్ద స్థాయి కి పోలేరు. చివరికి సామాన్య ప్రజలు కూడా దేవస్థానం లో దేవుని దర్శనానికి ,వసతికి కూడా రాజకీయ నాయకులనో ,అధికారులనో ఆశ్రయించ వలసి వస్తున్నది.మనకు రావలసిన కనీస అవసరాలు కూడా రెకమెండేషన్ లేకుండా రావడం లేదు.వ్యవస్థ విధంగా అయినది.కొంత మంది ప్రజలు ,కొంత మంది రాజకీయ నాయకులు కడుపు మంట తో ఆత్మ ద్రోహం చేసికొని మాట్లాడుతున్నారు.

28, ఏప్రిల్ 2012, శనివారం

కౌగిలింతల భయం పట్టుకున్న తెలుగుదేశం పార్టీ .

ఒక కౌగిలింత తెలుగుదేశం పార్టీ లో వణుకు పుట్టించింది.నిన్న జగన్, వంశీల పరస్పర పలకరింపులు,కౌగలింతలు తెలుగుదేశం పార్టీ వెన్నులో చలి పుట్టించింది , అని అనడానికి  నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రవర్తన చూస్తే     తెలుస్తుంది.ప్రజాస్వామ్యం గురించి  నిత్యం మాట్లాడే తెలుగుదేశం పార్టీ  ,రాజకీయాలలో వేరు వేరు రాజకీయ పార్టీలకు  ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు శత్రువులు లాగా ఉండాలని అనుకుంటుందా? రాజకీయాలు వేరు వ్యక్తిగత పలకరింపులు వేరు కాదా?ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?అంత బలహీన మైన పునాదుల మీద ఉందా తెలుగుదేశం పార్టీ?




ఆర్గానిక్ మోసం

          పూర్వం రైతులు తాము పండించిన విత్తనాలనే మళ్ళీ  విత్తడం కోసం  దాచిపెట్టుకొని తర్వాత సంవత్సరం విత్తుకునేవాళ్ళు.విత్తన శుద్ది కూడా రొచ్చు(పశువుల మూత్రం ) తో చేసుకునేవారు.పంటలకు పశువుల ఎరువును వాడే వారు.
    తర్వాత కాలంలో బహుళ జాతి కంపినీలు తమ లాభాల కోసం మార్కెట్ లో దిగి  ఒకసారి విత్తిన విత్తనాలు తర్వాత పనికి రాకుండా చేసి తప్పని సరిగా ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరే వాళ్ళు చెప్పిన  ధరకు విత్తనాలను కొనేలా చేసినారు.
         రైతులకు  రసాయనిక ఎరువులను దగ్గర చేయడం వలన వాళ్ళు పశువులను  పెంచకుండా పోయినారు.దీనివలన రైతులు తప్పని సరిగా రసాయనిక ఎరువుల మీద ఆధార పడేలా  చేసినారు .పూర్వం రైతులు దేని కోసం ఎవరి మీద ఆధార పడకుండా ఉండేవారు.కానీ ప్రభుత్వాల కున్న బహుళజాతి సంస్థల మీద ప్రేమ వలన రైతులు ఆర్థికంగా దెబ్బతిని పోయినారు.ఇన్ని చేసినా రైతులు పండించిన పంట కు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైనారు.

      కానీ అవే బహుళ జాతి సంస్థలు ఈ మధ్యన "ఆర్గానిక్ ఫుడ్ "అనే   ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని తిరిగి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.అదేం కొత్త విషయం కాదు.మన రైతులు పూర్వం సంప్రదాయకంగా చేస్తున్న పనిని ,వారిని దారి మళ్ళించి నాశనం చేసి తిరిగి అదే పద్దతి లోకి వచ్చి ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.బహుళ జాతి సంస్థల విష కౌగిలి నుండి రైతులను కాపాడడానికి ప్రభుత్వాలు రైతు పక్షపాతిగా పని చేయాలి.
         

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

సామాన్య ప్రజల కనీస అవసరాలు ఎందుకు తీరడం లేదు?

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులైనా ప్రజల కనీస అవసరాలు తీరడం లేదు.దీనికి ప్రధాన కారణం ,మనలను పాలించే ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలతో మమేకం కాకపోవడమే.
ఇందుకు ప్రధాన కారణం ,ప్రజా ప్రతినిధులకు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు కావలసినన్ని నీళ్ళు ,కావలసినంత కరెంటు,కావలసినంత గ్యాసు,కావలసినన్ని టెలిఫోన్ కాల్స్ ,అనారోగ్యం వచ్చినప్పుడు కార్పోరేట్ ఆసుపత్రులు మరియు వాళ్ళు రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిలిపివేయడమూ జరుగుతుంటాయి.చివరికి అంబులెన్స్ కు దారిని క్లియర్ చేయకున్నా వీళ్ళకు చేస్తారు.వాళ్ళు ఏమీ ఇబ్బంది లేకుండా .సి. రూములల్లో ఉంటారు.వాళ్లకు సామాన్య ప్రజల ఇబ్బందులు ఎలా అర్థమవుతాయి.అందుకే సామాన్య ప్రజల ఇబ్బందులు అలాగే ఉన్నాయి.ప్రజాప్రతినిధులు కూడా సామాన్యుని లాగే అన్ని సమస్యలు ఎదుర్కుంటే వాటి పరిష్కారానికి మనసు పెట్టి ప్రజాసేవకులు అనిపించుకుంటారు .లేకుంటే సామాన్య ప్రజల నెత్తిమీద వాళ్ళు పెనుభారం తప్ప ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు.

15, మార్చి 2012, గురువారం

పుట్టిన రోజు అంటే ?

పుట్టిన రోజు అంటే ...

" నీవు ఏడ్చినప్పుడు అమ్మ నవ్విన ఒకే ఒక రోజు."


ఇదీ ఒక మేధావి సమాధానం.

8, మార్చి 2012, గురువారం

మహిళా దినోత్సవం

మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

పిల్లల కంటే ముందు తల్లిదండ్రులను శిక్షించాలి.

పిల్లల్లో మధ్య హింసా ప్రవృత్తి పెరిగి పోతాఉంది. దీనికి పరాకాష్టే మొన్న తమిళనాడు లో జరిగిన సంఘటన .ఒక విద్యార్థి తమ టీచర్ ను క్లాసు రూము లోనే కత్తి తో పొడిచి చంపడం.ఇటువంటి పిల్లలు పెరిగి పెద్దైతే సమాజానికి చాలా ముప్పు.పిల్లవాని కంటే ముందు పిల్లవాని తల్లిదండ్రులను ఠినంగా శిక్షించాలి.ఎందుకంటే పిల్లవాడు విధంగా తయారు కావడానికి బాధ్యులు వాళ్ళే .చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేస్తున్నా అది తప్పు అని చెప్పకుండా నవ్వుతూ ఆనందిస్తుంటారు .పిల్లలకు తప్పొప్పులు చెప్పకుండా చాలా ముద్దు చేస్తుంటారు.ఇటువంటి పిల్లలే తర్వాత సమాజానికి ముప్పుగా పరిణమిస్తుంటారు. మధ్యన వస్తున్న సినిమాలు కూడా ఒక కారణం.చాలా సినిమాలల్లో టీచర్లను ,లెక్చరర్లను చాలా తేలిగ్గా చూపిస్తున్నారు.స్టూడెంట్స్ లెక్చరర్ల మీద కుళ్ళు జోకులు వేసే సీన్లు ఉంటున్నాయి.ఇంకా టి.వి. లలో యాంకర్లు ప్రేక్షకులతో మాట్లాడేటప్పుడు ,మొదట ఏం చదువుతున్నావు అని అడిగిన తర్వాత బాగా చదువుతున్నావా అని అడగడం లేదు .మీది కో ఎడ్యుకేషనా,కాలేజికి బంక్ కొడుతున్నావా ,ర్యాగింగ్ చేసారా,బాగా ఎంజాయ్ చేస్తున్నారా ? అని అడుగుతున్నారు.చాలా మంది పిల్లలు వీటిని అనుకరిస్తున్నారు. కాలేజీ లకు ,స్కూళ్ళకు పోయేది పై వాటి కోసమే నేమో మనమేమో చదువుకొని పొరపాటు చేసున్నామేమో అని అంతో ఇంతో చదివే పిల్లలు కూడా మారుతున్నారు.ముఖ్యంగా తల్లిదండ్రులు ,మీడియా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

6, ఫిబ్రవరి 2012, సోమవారం

అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా పని చేయగలదా?

అధికార యంత్రాంగాన్ని మన రాజకీయ నాయకులు నిజంగా నిష్పాక్షికంగా పని చేయనిస్తారా? నూరు ఎకరాల భూమి ఉండే అతనికి వృద్దాప్య పించను వస్తా వుంది.ఆర్థికంగా బాగా ఉండేవారు కూడా నాలుగైదు ఇందిరమ్మ గృహాలను సాంక్షను చేయించుకొని మేడలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు.అధికారులేమో వీళ్ళకు ఇవ్వొద్దని చెబుతారు.కానీ వీళ్ళకు ఎలా అందాయి.వీళ్ళు అక్కడ స్థానికంగా ఉండే సర్పంచ్ లాంటి వ్యక్తులకు కావలసిన వ్యక్తులో ,చుట్టాలో అయి ఉంటారు.ఇవన్నీ రాజకీయ నాయకుల ప్రమేయం తోనే జరుగుతాయనేది బహిరం రహస్యం.సర్పంచ్ స్థాయి లోనే ఇంత జరుగుతుంటే పై స్థాయిలో అధికారుల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఊహించుకోవచ్చు.ఇప్పుడు రాజకీయ నాయకులు మేము చేయమంటే చేయడానికి అధికారులేమైనా చిన్నపిల్లలా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిజంగా ఏమి జరుగుతుందో రాజకీయనాయకులకు తెలియదా?ఎందుకు ఆత్మ ద్రోహం చేసుకొని మాట్లాడుతున్నారు.మొన్నటికి మొన్న మద్యం సిండికేట్ల విషయంలో .సి.బి. దాడులు జరిగాయి.అందులో చాలా మంది రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చినాయి.కాని వాటిని బయట పెట్టలేదు . అవి బయట పెట్ట వద్దని అధికారైనా చెప్పారా?వాటిని మూసి పెట్టి తమ తమ రాజకీయ మైలేజీలను సాధించు కోవాలని ప్రయత్నం చేయడం లేదా?ఇన్ని మాటలు మాట్లాడుతున్నరాజకీయనాయకులు తాము నిజాయితీ పరులమని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా?ఇంత రాద్దాంతం జరుగుతున్న సమయం లో కూడా ఒక టాక్ షో లో పాల్గొన్న ఒక రాజకీయ నాయకుడిని వాళ్ళ అనుచరులను పోషించడానికి ,రాజకీయాలు చేయడానికి నెలకు ఎంత ఖర్చు అవుతుందన్న ప్రశ్నకు రాజకీయ నాయకుడు జవాబు దాట వేసాడు . రాజకీయనాయకుడు నిజాయితీ గా ఆదాయపన్ను కట్టి చేస్తున్న ఖర్చు అయితే ఎందుకు జవాబు దాట వేస్తాడు.వ్యవస్థ లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు తప్ప ఆవతలి వాళ్ళు అందరూ అవినీతి పరులని ఆత్మ ద్రోహం చేసుకుంటూ మాట్లాడుతున్నారు.ఇలా ఉన్న వ్యవస్థలో కూడా ఇంకా నిజాయితీ పరులైన అధికారులూ మరియు రాజకీయ నాయకులు మిగిలే ఉన్నారు.అందుకే వ్యవస్థలు కొంతవరకైనా పనిచేస్తున్నాయి.