23, డిసెంబర్ 2012, ఆదివారం

తెలుగు మాట్లాడ్డం నామోషి అయ్యింది!ఇంకెక్కడ తెలుగు !

తిరుపతి లో తెలుగు మహా సభలు జరపడానికి ప్రభుత్వం సన్నద్దమవుతున్నది .కానీ అదే చిత్తూరు జిల్లా నుండి వచ్చి ఈ మధ్యన  బెంగుళూరులో స్థిరపడిన ప్రజలు చాలా మంది ఇంట్లోనూ మరియు వారి ఊర్లకు వెళ్ళినప్పుడు తమలో తాము కన్నడం లో మాట్లాడుతామని చెబుతారు.వీళ్ళు కన్నడం లో మాట్లాడుతుంటే వాళ్ళ ఊర్ల లోని ప్రజలు నోర్లు తెరుచుకొని చూస్తుంటే వీళ్ళకు అది ఒక గొప్ప.ఇంట్లో పిల్లల తో కూడా వాళ్ళు  చాలా మంది కన్నడం లోనే మాట్లాడతారు.మా పిల్లలకు అస్సలు తెలుగు మాట్లాడడం రాదు అని గొప్పగా చెప్పే వాళ్ళు ఉన్నారు.ఇది నాణానికి ఒక వైపు.కానీ ఇదే బెంగుళూరు లో ఉన్న కొన్ని కుటుంబాలు కొన్ని తరాల నుండి  ఇక్కడే ఉన్నాయి.వాళ్ళ పెద్దలు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో ,ఎక్కడ నుండి వచ్చారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం స్పష్టమైన తెలుగులో మాట్లాడతారు.కోలారు జిల్లా కు చెందిన కొత్త దేవరు వక్కలిగులు (గౌడ లు)కూడా  చాలా మంది  అచ్చ తెలుగులో మాట్లాడతారు.అలాగే తమిళనాడులోని హోసూరు కు మరియు కృష్ణగిరి జిల్లాలకు చెందిన  వాళ్ళు,అలాగే బెంగుళూరుకు శివారులో ఉన్న అత్తిబెలె,అనేకల్ ,జిగిని ప్రాంతాల వాళ్ళు కూడా  తెలుగును నిలబెట్టుకున్నారు.చివరికి వీళ్ళు మాట్లాడేటప్పుడు  ఊర్ల పేర్లు కూడా తెలుగులోకి అనువాదం చేసి చెబుతారు.ఉదాహరణకు హోసోరును కొత్తూరని,హొసకోటను కొత్తకోటని,హొసహళ్లి ని కొత్తపల్లి అని  చెబుతారు.ఒక సారి నేను బెంగుళూరు శివారు ప్రాంతమైన హొసహళ్లి కి పోవలసి ఉంది.ఆ ప్రదేశానికి వెళ్లి హొసహళ్లి  కి దారి అడిగితే కొత్తపల్లి కి  ఇలా పోవాలి అని చెప్పారు.అదేంటి నేను హొసహళ్లి కి దారి అడిగితే కొత్తపల్లికి దారి చూపిసున్నారని కొంచం సేపు తిక మక పడ్డాను,తర్వాత అర్థం అయ్యింది వాళ్ళు చూపించింది నేను అడిగిన ఊరికే అని.కన్నడం లో హొస  అంటే  కొత్త అని,హళ్లి అంటే పల్లి అని అర్థం.అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.
                    ఇంకా ఒక ఒక ముఖ్యమైన విషయం ఏమంటే బెంగుళూరులో ఒక రోడ్డుకు వేమన పేరు ఉంది.వేమన జయంతి ఉత్సవాలు ఇక్కడ ,హోసూరు లో ఘనంగా చేస్తారు.కానీ మన దగ్గర వేమన గురించి ఎవరూ పట్టించు కునే వారే లేరు.మన వాళ్లకు తెలుగులో మాట్లాడడం చాలా నామోషి అయ్యింది.మన పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళలో వేసి అలా తెలుగు రాకుండా పోయి,ఇటు ఇంగ్లీషు రాక రెంటికీ చెడిన రేవడులు  అయ్యారు.ఆంధ్ర దేశం లో ఉన్న వాళ్ళ కంటే బయట ఉన్న వాల్లే తెలుగును బాగా కాపాడు కుంటున్నారు. తెలుగు భాష కలకాలం వర్థిల్లాలని కోరుకుంటూ .....

2 వ్యాఖ్యలు:

uma blog చెప్పారు...

memu blore lo unnaa ....maa intlo teluge andi matladadam ..talli bashalo cheppinatlu gaa mana baavaalu vere baashalo vyakta parachalem kadaa

రమణారెడ్డి చెప్పారు...

అవును ఉమ గారు మీ లాంటి వాల్లు కొద్ది మంది ఉన్నారు గనకనే తెలుగు భాష ఇంకా బ్రతికే ఉంది.