6, జులై 2010, మంగళవారం

రాయలసీమ మాండలికం లో వాడే కొన్ని పదాలు

రాయలసీమ(జమ్మలమడుగు,ప్రొద్దుటూరు ప్రాంతాలలో పల్లెల్లో ) లో వాడే కొన్ని పదాలు మధ్య కనుమరుగవుతున్నాయి.ఒకసారి గుర్తు చేసుకుంటూ..

అమ్మలపొద్దు = ఉదయం తొమ్మిది గంటల సమయం.
పైటాల = మధ్యాన్నం.
మాయిటాల = పొద్దు గూకే వేళ.
వాకిలి =తలుపు.
సిలుకు = తలుపుకు పెట్టే గొళ్ళెం లాంటిది.
గడెమాను = తలుపుకు అడ్డంగా లోపలనుండి పెట్టే గడియ.
బూయిండ్లు = వంట గది.
నడవ = హాల్ .
ఆయిపిండ్లు = పంటలను దాచు కునే రూము.
దండెం = బట్టలను వేసేందుకు ఉపయోగించే త్రాడు లేక కర్ర.
ఉట్టి = పదార్థాలను ఎత్తిపెట్టెందుకు వేలాడదీసిన త్రాడు(గిన్నెలను పెట్టడానికి అనుకూలంగా ఉన్న).
సుట్టకూతురు = కుండలు పడిపోకుండా ఉండేదుకు కుండ క్రింద పెట్టే వృత్తాకారంలో ఉండే త్రాడు.
అటిక = మట్టికుండ.
బాణ = నీళ్ళు నింపుకునేందుకు ఉపయోగించే మట్టి కుండ .
కడవ = నీళ్ళు పట్టుకు రావడానికి ఉపయోగించే మట్టి పాత్ర.
తప్యాల = వంట వండుకునే లోహ పాత్ర.
బోకులు = లోహ పాత్రలు.
చెంబు = నీళ్ళు త్రాగడానికి ఉపయోగించే లోహ పాత్ర .
ఆబువ్వ = వరి అన్నం.
సిబ్బి = అన్నం గంజి వార్చ డానికి ఉపయోగించే వెదురుప్లేట్ .
తాపలు = మెట్లు (స్టెప్స్ ).
మెట్లు = చెప్పులు.
మచ్చు = పశువుల కోసం గడ్డిని ఉంచే ప్రదేశం.
మేపు = పశువుల కోసం ఉపయోగించే ఎండు గడ్డి.
జొల్ల = పశువుల గడ్డిని తేవడానికి ఉపయోగించే వెదురుతో చేసిన ఒక పెద్ద బుట్ట.
గాజ = ధాన్యాన్నినిలువ చేసేందుకు ఉపయోగించే వెదురు బుట్ట.
ఎనుము =బర్రె.
రొచ్చు = పశువుల మూత్రం.
తలుగు =పశువులను కట్టేందుకు ఉపయోగించే త్రాడు.
మోకు = వ్యవసాయ పనులకు ఉపయోగించే త్రాడు .
మాసీలు =పంటలు.
అబ్బ =నాన్న నాన్న.
జేజి = నాన్న అమ్మ.
తాత =అమ్మ నాన్న.
అవ్వ =అమ్మమ్మ.

పదాలు కొన్ని మధ్యన కనుమరుగు అవుతున్నాయి,వాటిని కాపాడుకోవలసిన భాద్యత ఉంది.

మరి కొన్ని పదాలు తర్వాత చూద్దాం..



12 కామెంట్‌లు:

హరి చెప్పారు...

పదాలు బాగా సేకరించారు. వీటికి తెలంగాణాలో వాడే సమానార్థకాలు కొన్ని.

అమ్మలపొద్దు = అంబటాల్ల
పైటాల = పగటీలి
మాయిటాల = మాపటీలి
గడెమాను = బేడెం
బూయిండ్లు = ఒంటిల్లు.
ఆయిపిండ్లు = గరిశె
నడవ = జగిలి.
సుట్టకూతురు = సుట్టకుదురు
తప్యాల = తపాల.
జొల్ల = గుల్ల
గాజ = గుమ్మి

వేరే అర్థంలో వాడే సమాన పదాలు:

వాకిలి = ఇంటి బయటి స్థలం
అటిక = కూర వండే మట్టి పాత్ర.

ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో అవ్వను అమ్మ అర్థంలో, అమ్మను అవ్వ అర్థంలో వాడతారు.

Praveen Mandangi చెప్పారు...

మా ప్రాంతంలో కూడా ముంతని చెంబు అని అంటారు. ఆ మధ్య అనంతపురంకి చెందిన అమరనాథ రెడ్డి గారు మా పక్క జిల్లా అయిన విజయనగరం వచ్చినప్పుడు అతని మాటలు విన్నాను. రాయలసీమ యాసలో నెత్తురు అంటే రక్తం అని, అప్ప అంటే తండ్రి అని తెలిసింది.

అజ్ఞాత చెప్పారు...

good

అజ్ఞాత చెప్పారు...

బూయిండ్లు , ఆయిపిండ్లు
హీ హీ బాగున్నాయ్. ఏదో భూతాల ఇల్లు, ఆపిల్ పండ్లు లాగున్నాయి.

చదువరి చెప్పారు...

చాలావరకు మేమూ (గుంటూరు) ఈ మాటలనే వాడతాం:

పైటాల
మాయిటాల
వాకిలి
గడెమాను
నడవ
దండెం
ఉట్టి
సుట్టకూతురు - చుట్టకుదురు అంటాం
అటిక - అటిక తలకాయ అని తిట్టడం మావైపు రివాజు
బాణ - బాన అంటాం
కడవ
తప్యాల
చెంబు
సిబ్బి - అల్యూమినియమ్ మూత పళ్ళాలను సిబ్బిరేకులు అని అంటాం. అదీ ఇదీ ఒకటేనేమో!
మచ్చు -మచ్చు, మొచ్చు అని అంటాం –ఇంగ్లీషులోని అట్టిక్ అని అనుకోవచ్చు.
మేపు - మేత మేపటం
గాజ - మేం గాదె అని అంటాం
ఎనుము - బర్రె అనే అంటాం.
రొచ్చు – మేం ఉచ్చ అంటాం. దానితో పేడా మట్టీ, అంతా కలిసి బురద బురద అవుద్దే.. దాన్ని అంటాం రొచ్చు అని. బర్రెలే కాదు, ఎవరు చేసినా ఉచ్చ అనే కాదు, ఎలా చేసినా రొచ్చనే అంటాం.
తలుగు -దీన్నేమంటామో గుర్తుకు రావటంలా. కానీ కట్టేసే కర్రను మాత్రం కట్టుగొయ్య అని అంటాం.
మోకు
మాసీలు - పంట నూర్పిడిని మేం మాసూలు అని అంటాం.

అజ్ఞాత చెప్పారు...

బావుంది మంచి ప్రయత్నం

జిగురు సత్యనారాయణ చెప్పారు...

బహుశ ఇవి అన్నీ రాయలసీమ మాండలీకము కాక పోవచ్చు. వీటిలో కొన్ని అన్ని చోట్ల వాడే అచ్చ తెనుగు పదాలు ఉన్నవి.
నావరకు కొన్ని పదాలను పలనాటి ప్రాంతములో కూడా విన్నాను. (పైటాల , వాకిలి, దండెం , ఉట్టి , కడవ, తప్పేల, చెంబు, సిబ్బిరేకు, రొచ్చు, మోకు)

భావన చెప్పారు...

బలే వున్నాయండీ..
నడవ,దండెం, ఉట్టి, చుట్టకుదురు(సుట్టకూతురు), కడవ, చెంబు, గాదె (గాజ), ఎనుము, రొచ్చు, మోకు, అబ్బ (కించ పరిచే లేదా నవ్వులాట గానో వాడే సంధర్బాలలో వాడతారు అబ్బ అని), తాత, అవ్వ, జేజి మేము కూడా కృష్ణా జిల్లా లో వాడతాము.

మయూఖ చెప్పారు...

అందరికీ ధన్యవాదములు.

వేణు గోపాల రెడ్డి చెప్పారు...

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని పదాలు వాటి అర్థాలు అక్కడ మాండలికాన్ని తెలిసినవారు ముఖ్యంగా ఆ జిల్లా వాసులు రాయండి.

అజ్ఞాత చెప్పారు...

Maa kadapa basha

Unknown చెప్పారు...

రాయలసీమ లో సిటీ ని ఎం అంటారు