ఒకప్పుడు ఊర్లలో జొన్నలు దాచు కోవడానికి పాతర్లు ఉండేవి.5 పుట్లు 6 పుట్లు (ఇంకా పెద్దవి కూడా ఉండేవి )పట్టే పాతర్లు ఉండేవి.రైతుకు ఎన్ని పాతర్లు ఉంటే అంత గొప్ప .ఆ పాతర్లను పంట వచ్హే ముందు సున్నం కొట్టించి ,అందులో సొప్పతో మంట పెట్టెవారు.దాని వలన ఎన్ని రోజులైనా జొన్నలకు పురుగు వచ్హేది కాదు.
రైతుకు జొన్నలు అవసరం అయినప్పుడు ఆ పాతరను తీసి నులక మంచాన్ని ఆ పాతర మీద పడుకో బెట్టేవారు.అందులోని చెడుగాలి బయటికి పోయిన తర్వాత జొన్నలు తీయడానికిమనుషులు దిగేవారు.
ఎవరైనా పాతర తీసినారని తెలుస్తే ఆ రోజు ఆ వీధి లోని పిల్లకాయలు ఆన్నాన్నే తారాడ్తంటారు.పిల్లకాయలకు ఆ రోజు పండగ లాగా ఉండేది.రైతులు ఆ పిల్లకాయల అంగీలో జొన్నలు పోసేవారు.జొన్నలు తీసుకొని అంగటికి పోయి బొంగులో ,నిమ్మప్పులో,చిలక బిస్కట్లో కొనుక్కునేవారు.
ఇప్పుడు జొన్నలు పండించే వాల్లు తక్కువైనారు,ఒక వేల పండించినా ఈ ఏరోసు లు (వేర్ హవుస్ ,గోడౌన్లు )వచ్హిన తర్వాత పంటని అక్కడికి తోల్తన్నారు.జొన్నలు తీసుకుని బొంగులో ,నిమ్మప్పులో,చిలక బిస్కట్లో ఇచ్హే అంగడి వాళ్ళు లేరు.పాతర్లు పాడు బడ్డాయి.