3, సెప్టెంబర్ 2009, గురువారం

ఆగి పోయిన తెలుగు ప్రజల హృదయ స్పందన ...

ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల హృదయ స్పందన ఆగి పోయింది.అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పరితపించిన మనసున్న మనిషి ఇక లేడు అని వార్తను ఇప్పటికీ నమ్మలేకున్నాము.నిన్నటి నుండి ఏదో మిరాకిల్ జరిగి ఆయనకు ఏమీ కాదు అని అను కుంటూ ఉంటిని,కాని దేవుడు చిన్నచూపు చూసినాడు.ఇంతమంది ప్రజాభిమానాన్ని చూరగొన్న రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఇంతకు ముందు లేడు,ఇక రాడు.ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఆయనను మృత్యుదేవత ఇంత నిర్దాక్షిణ్యంగా కబలిస్తుందని ఊహించలేదు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని భాదాతప్త హృదయం తో దేవుని మనసారా ప్రార్థిస్తూ......

16, ఆగస్టు 2009, ఆదివారం

ధనవంతుల జబ్బు

స్వైన్ ఫ్లూ గురించి ప్రభుత్వాలు,మీడియా చాలా హడావిడి చేస్తున్నాయి,ఎందుకంటే ఇది విమానాల ద్వారా విదేశాలనుండి దిగుమతైన ధనవంతుల జబ్బు కాబట్టి.మన దేశంలో మలేరియా ,అతిసార వలన కొన్ని వేల మంది ప్రతిసంవత్సరం మరణిస్తున్నారు.ఒక్కరోజైనా ప్రభుత్వాలు ,మీడియా ఇంతగా స్పందించాయా?ప్రజల ప్రాథమిక హక్కుఅయిన రక్షిత మంచి నీరు కూడా పొందలేక మధ్యన హైదరాబాదు లో చాలా మంది చని పోయారు.ప్రజలకు కనీసవైద్యం అందించ లేని ప్రభుత్వాల చేతగాని తనం వలన మన దేశం లో గర్భిణుల ,శిశువుల ,గిరిజనుల,ప్రజల మరణాలుసంభవిస్తున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాల విలువ ప్రభుత్వాల,మీడియా దృష్టిలో ఏంటో ఇప్పుడు అర్థం అవుతున్నది. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవద్దని నేను చెప్పడం లేదు.జాగ్రత్తలు తీసుకోవలసిందే,కానీ సామాన్యప్రజలకు వచ్చే నయం చేయగలిగే జబ్బులను కూడా ప్రభుత్వాలు పట్టించుకొని ,వారి ప్రాణాలకు కూడా ధనవంతుల ప్రాణాల కున్న విలువలో కొంత విలువైన ఇస్తే చాలా సంతోషం.

5, ఆగస్టు 2009, బుధవారం

చిరంజీవిగారి స్వయంకృతాపరాధం

చిరంజీవి గారి పార్టీ నుండి ఒక్కక్కరూ నిష్క్రమిస్తున్నారు.దీనికంతటికి చిరంజీవిగారు చేసుకున్నస్వయంకృతాపరాధమే.ఆయన మార్పు అని వచ్చి అధికారమే పరమావధిగా, ఇతర పార్టీ నుండి వచ్చిన వారిని ఇష్టంవచ్చినట్లు తీసుకున్నారు.వాళ్లకు అధికారం దక్కలేదు కాబట్టి వాళ్ల దారి వాళ్లు చూసుకుంటున్నారు.చిరంజీవిగారుకొత్తవాళ్ళకు ,ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వాళ్లకు,అవినీతి మకిలి వీలైనంత తక్కువ అంటిన వాళ్లకు ,ఇప్పుడునడుస్తున్న రాజకీయానికి భిన్నమైన రాజకీయం చేయాలనే వాళ్లకు ,మేధావులకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.ఏదో ప్రయోజనం ఆశించి వచ్చిన వాళ్లు ,ఒక్కక్కరు బయటికి వెళుతుంటే అక్కడ ఉన్న వాళ్లకు కూడాతమ తమ రాజకీయ భవిష్యత్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.ప్రజలకు కూడా పార్టీ ఉంటుందా మునుగుతుదా అని డైలమా లో పడ్డారు.

రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ,అప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న మెజారిటీ వ్యక్తులకు టిక్కెట్లుఇచ్చినారు.రామారావు గారిని టిక్కెట్లు అమ్ముకున్నారని ఒక్కరు కూడా వేలెత్తి చూపలేదు. చిరంజీవి గారికి రామారావు గారికి అదే తేడా .అందుకే రామారావు గారు అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించినారు.ప్రజలకుఏమాత్రం తెలియని వాళ్లు కూడా రామారావు గారి బొమ్మ పెట్టుకొని విజయం సాధించినారు.ఇప్పుడున్న తెలుగుదేశంపార్టీకి అప్పటికి తేడా ఉంది,అది వేరే విషయం.

5, జులై 2009, ఆదివారం

లోకసత్తా పార్టీ మీద చంద్రబాబు గారి గోబెల్స్ ప్రచారం

చంద్రబాబు గారు లోక్సత్తా పార్టీ మీద తిరిగి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టినారు.ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు మాత్రమే అర్హతలు ఉన్నాయని ఆయన భ్రమ.లోక్సత్తా ,ప్రజారాజ్యం వాళ్లు వచ్చి ఆయన ఓటు బ్యాంకు ను కొల్లగొట్టారని ఆయన ఆరోపణ.ఏదో ఆయన జాగీరు పోయినట్లు,ఆయన అధికారంలోకి రాకపోవడం ఆంధ్రప్రజలు చేసుకున్న పాపం లాగా ఆయన చాలా బాధపడిపోతున్నారు.ఆయనకు విశ్వసనీయత లేదని మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు తేల్చేశారు.ఆయన ఏ రోజు కూడా ప్రజల అవసరాలు గుర్తించలేదు.ఎంతసేపు ఆయన దృష్టి అంతా అధికారాన్ని ఏదోవిధంగా పొందడమే.ఈవాళ లోక్సత్తా మీద ఆయన ఆరోపణలుచూసి ప్రజలు నవ్విపోతున్నారు.ప్రజలకు కొత్తరాజకీయాన్ని పరిచయం చేసిన లోక్సత్తా లాంటి పార్టీని ఆయన కాంగ్రెస్ ఏజెంటు లాగా అభివర్ణిస్తే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు.చంద్రబాబుగారి మీద కొంతమందికి అంతో ఇంతో ఉన్న సానుకూల మైన అభిప్రాయం కూడా ఈ వాళ పటాపంచలయి పోయింది.ఈ ప్రకటన తో ఆయన విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింది.ఆయన వైఖరి ఎలా ఉందంటే ఏదైనా పోటీలో నేనొక్కన్నే ఆడతాను ,అందులో నేనే మొదటి ,తర్వాతి స్థానాలలో ఉంటాను మిగతా వాళ్ళంతా చూస్తూ ఉండండి అనే విధంగా ఉంది.ఆయన ఓటమి ని క్రీడా స్ఫూర్తితో తీసుకోలేకున్నారు.ఆయన మానసిక పరిస్థితి ఇలాగే ఉంటే ఆయన పార్టీ పరిస్థితి ,ఆయన్ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది.తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుగారే గుదిబండగా మారే పరిస్థితి ఉంది.