26, జూన్ 2014, గురువారం

అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు బారులు తీరరో !

                  ఎన్నికలప్పుడు వివిధ రకాలైన ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత అవి తీర్చ లేక  వాటి నుండి తప్పించు కోవటానికి ప్రభుత్వాలు  రక రకాల షరతులు  విధిస్తూ  ఉంటే, హామీలు నమ్మి ఓట్లు వేసిన ఓటర్లు  తమ గోడు ను ఎవరికీ చెప్పు కోవాలనో అర్థం కాక తెల్ల మొకం వేసికొని బిత్తర చూపులు చూస్తున్నారు . 

                  ఇలా ఇంత సులభంగా ఉచిత హామీలు ఇచ్చి అధికారం లోకి రావచ్చు అనుకుంటే  ఇంకొకాయన వచ్చి తలా ఒక కిలో బంగారం ఇస్తానంటాడు(ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ) . ఓట్లు వచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత తాను  నియోజకవర్గానికి ఒక కిలో ఇస్తానన్నా నని ,ఒక కారెట్ బంగారం కిలో  ఇస్తానన్నాని , బంగారం పూత పూసినది  ఒక కిలో ఇస్తానన్నాని ఇలా రకరకాలుగా చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తమ పబ్బం గడుపుకొని వెళ్తారు . చివరికి ఓటర్లు తాము మోస పోయామని  గుర్తిస్తారు. తిరిగి 5 సంవత్సరాల తర్వాత మోసం చేయడానికి కొత్త హామీల తో  వస్తారు.     
            
                  రాజకీయ పార్టీ లు ఓటర్లు పోలింగు కు రావడం లేదని చెబుతూ ,పోలింగు శాతం పెంచడానికి ఓటింగు ను కంపల్సరీ చేయాలని చెబుతూ ఉంటారు . ప్రజలు పోలింగు కు ఎందుకు రావడం  లేదని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా ?ముఖ్యంగా రాజకీయ పార్టీలు  ఇచ్చే హామీల మీద నమ్మకం లేకనే !

                  ప్రతి చిన్న వస్తువు కొన్నా కూడా  వినియోగదారుడు మోస పోకుండా వినియోగ దారుల చట్టం ఉంది . కానీ ప్రజాస్వామ్యం లో ఓటరు కు తానూ నమ్మి ఓట్లు వేసిన ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో అనే నమ్మకం లేదు .  

                    ఎన్నికల కమీషన్ ఇప్పటి కైనా  సంస్కరణ లు తేవాలి. రాజకీయ పార్టీల హామీలు స్పష్టంగా కూడా ఉండాలి,ఉదా: సింగపూర్ చేస్తాను,అమెరికా చేస్తాను,ఆఫ్రికా చేస్తాను లాంటి అస్పష్టమైన హామీలు ఉండ  కూడదు . రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద బడ్జెట్ చూపించి నిధులు ఏ రూపంగా సేకరిస్తారో ,ఎంత సమయం లోపల ఆ హామీలు నేర వేరుస్తారో రాజకీయ పార్టీల నుండి రాతపూర్వకంగా  తీసికోవాలి . ఎన్నికల కమీషన్ ఆ హామీల మీద సంతృప్తి  చెందిన తర్వాత నే ఆ పార్టీలు మానిఫెస్టో లో పెట్టాలి . ఒక వేల ఆ హామీలు ఆ నిర్దిష్ట సమయం లోపల నెరవేరక పోతే ఆ ప్రభుత్వం ఆటోమాటిక్ గా రద్దయ్యే గా చట్టం చేయాలి. తిరిగి ఎన్నికలు నిర్వహించాలి . ఆ ఎన్నికల ఖర్చును హామీలు నెరవేర్చ లేక అధికారం నుండి  దిగి పోయే రాజకీయ పార్టీ నుండి  వసూలు చేయాలి . ఆ అసత్యపు  హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీ ని కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ఎన్నికలలో పోటీ చేయ కుండా నిషేధించాలి . 

                           అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు  బారులు తీరరో !తాము కోరుకున్న పార్టీని ,తమకు నచ్చిన హామీలు ఇచ్చిన పార్టీని ఎన్నుకోవడానికి  ఓటర్లు బారులు తీరి పోలింగు బూతు కు వస్తారు . 
                     

                 
                          

24, జూన్ 2014, మంగళవారం

ఎవరు దార్శనికులు ?

విడిపోయిన  తర్వాత 15000 కోట్ల  లోటు బడ్జెట్ ఉందని తెలిసినా   అధికారం  కోసం ఇష్టమొచ్చిన  హామీలు  ఇచ్చిన  చంద్రబాబు గారు దార్శనికులా ,బాధ్యత గా  అమలు చేయగలిగే హామీలు ఇచ్చిన జగన్ దార్శనికులా ?వయసుకు దార్శనికతకు  ఏమైనా సంభంధం ఉందా? ఒక వేల చంద్రబాబు గారు ఇచ్చినటువంటి  హామీలు ఇచ్చి  జగన్ అధికారం లోకి వచ్చి ఉండి  ఉంటే  ఈ పాటికే వివిధ మీడియాలలో దార్శనికత మీద చర్చలు జరిగి ఉండక పోయేవా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు .  

11, జూన్ 2014, బుధవారం

అంతటి అనుభవజ్ఞులకు అంత సమయం అవసరమా ?

             వై.ఎస్ . గారికి ఎప్పుడో అంజయ్య గారి ప్రభుత్వం లో కొన్ని రోజులు మంత్రిగా చేసిన అనుభవం తప్ప ఏమీ అనుభవం లేకున్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ పై మొదటి సంతకం చేసి అధికారం లోకి వచ్చిన మొదటి రోజు నుండే  అమలును ప్రారంభించారు . 
  
            కానీ మంత్రిగా ,9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా,10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ,ప్రధానులని ,రాష్ట్రపతులని ఎన్నిక చేసిన వ్యక్తిగా,బిల్గేట్స్ ను,బిల్ క్లింటన్ ను రాష్ట్రానికి తీసుకొని వచ్చి మొత్తం ప్రపంచం దృష్టి ని మన రాష్ట్రం వైపు మరల్చి పెట్టుబడులను తీసుకొని వచ్చిన వ్యక్తిగా,హైదరాబాదును  హై టెక్ సిటి గా అభివృద్ది  చేసిన వ్యక్తిగా,విజన్ 2020 రూపశిల్పిగా, అంత దూర దృష్టి  ఉన్న వ్యక్తిగా   అంత అనుభవం  ఉన్న చంద్రబాబు గారు తాను  చెప్పిన  మొదటి సంతకం  రైతు రుణమాఫీ అమలుకు, కమిటీ వేసి ఎందుకు 45 రోజులు సమయం తీసుకున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.   

            తెలంగాణా విభజనకు లేఖ ఇచ్చి చివరి వరకూ దానికి కట్టుబడి ,సమైఖ్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక్కసారి కూడా  జై సమైఖ్యాంధ్ర అనకుండా చంద్రబాబు గారు  మాటకు కట్టుబడి ఉన్నారు. తెలంగాణా విడిపోతే ఆంధ్రప్రదేశ్  ఆర్ధిక పరిస్థితి ఏమిటో  కూడా చంద్రబాబు లాంటి మేధావులకు తెలియనిది కాదు. అయినా కూడా  ఎన్నికల ముందు   ఆంధ్రప్రదేశ్   ప్రజలకు వాళ్ళ బాగు దృష్ట్యా చంద్రబాబు గారు తమ మేనిఫెస్టో లో వివిధ రకాలైన హామీలు ఇచ్చారు . తాను  చేసి చూపిస్తానన్నారు . ప్రజలు ఆయనకు ఉన్న అనుభవాన్ని నమ్మి  ఆయనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కావున కమిటీ ల తో, శ్వేత పత్రాలతో కాలయాపన చేయకుండా హామీలను నెరవేర్చాలని ప్రజలందరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు . 

   


9, జూన్ 2014, సోమవారం

ఇదేంది బాబూ!

మొదటి సంతకం రైతు  ఋణ మాఫీ మీద అని ఎన్నికల ప్రచారం లో ఊదర గొట్టేసిన టి.డి. పి  వాళ్ళు మరియు వారి అనుకూల మీడియా  తీరా ప్రమాణ స్వీకారం సమయం వచ్చేటప్పటికి ఋణ మాఫీ మీద ఏర్పాటు చేసిన కమిటీ మీద సంతకం చేసి  రైతులను ఉసూరుమనిపించారు.కిరణ్ గారి ప్రభుత్వం లోకూడా డెల్టా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఆందోళనలు చేస్తుంటే ,వివిధ మీడియాలలో చర్చలు పెట్టి చివరికి ఒక మోహన్ కందా కమిటీ వేసారు. అది ఏమయ్యిందో ఇంత వరకూ తెలియదు. ఇది కూడా  అలాంటి కమిటీ కాకుంటే బాగుంటుంది . అయినా ఇప్పుడు రైతులకు అర్జెంటుగా ఋణాలు  కావాలి. సీజన్ మొదలైంది. కమిటీ ల తో కాలయాపన చేస్తే అదును  తప్పి పోతుంది. కావున ప్రభుత్వం కమిటీ ల తో కాలయాపన చేయకుండా ఋణమాఫీ  యుద్దప్రాతిపదిక మీద  అమలు చేయాలి.           

1, జూన్ 2014, ఆదివారం

శుభాకాంక్షలు!

తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో తెలంగాణా ప్రజలందరికీ హృదయపూర్వక  శుభాకాంక్షలు .