23, డిసెంబర్ 2012, ఆదివారం

తెలుగు మాట్లాడ్డం నామోషి అయ్యింది!ఇంకెక్కడ తెలుగు !

తిరుపతి లో తెలుగు మహా సభలు జరపడానికి ప్రభుత్వం సన్నద్దమవుతున్నది .కానీ అదే చిత్తూరు జిల్లా నుండి వచ్చి ఈ మధ్యన  బెంగుళూరులో స్థిరపడిన ప్రజలు చాలా మంది ఇంట్లోనూ మరియు వారి ఊర్లకు వెళ్ళినప్పుడు తమలో తాము కన్నడం లో మాట్లాడుతామని చెబుతారు.వీళ్ళు కన్నడం లో మాట్లాడుతుంటే వాళ్ళ ఊర్ల లోని ప్రజలు నోర్లు తెరుచుకొని చూస్తుంటే వీళ్ళకు అది ఒక గొప్ప.ఇంట్లో పిల్లల తో కూడా వాళ్ళు  చాలా మంది కన్నడం లోనే మాట్లాడతారు.మా పిల్లలకు అస్సలు తెలుగు మాట్లాడడం రాదు అని గొప్పగా చెప్పే వాళ్ళు ఉన్నారు.ఇది నాణానికి ఒక వైపు.కానీ ఇదే బెంగుళూరు లో ఉన్న కొన్ని కుటుంబాలు కొన్ని తరాల నుండి  ఇక్కడే ఉన్నాయి.వాళ్ళ పెద్దలు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో ,ఎక్కడ నుండి వచ్చారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం స్పష్టమైన తెలుగులో మాట్లాడతారు.కోలారు జిల్లా కు చెందిన కొత్త దేవరు వక్కలిగులు (గౌడ లు)కూడా  చాలా మంది  అచ్చ తెలుగులో మాట్లాడతారు.అలాగే తమిళనాడులోని హోసూరు కు మరియు కృష్ణగిరి జిల్లాలకు చెందిన  వాళ్ళు,అలాగే బెంగుళూరుకు శివారులో ఉన్న అత్తిబెలె,అనేకల్ ,జిగిని ప్రాంతాల వాళ్ళు కూడా  తెలుగును నిలబెట్టుకున్నారు.చివరికి వీళ్ళు మాట్లాడేటప్పుడు  ఊర్ల పేర్లు కూడా తెలుగులోకి అనువాదం చేసి చెబుతారు.ఉదాహరణకు హోసోరును కొత్తూరని,హొసకోటను కొత్తకోటని,హొసహళ్లి ని కొత్తపల్లి అని  చెబుతారు.ఒక సారి నేను బెంగుళూరు శివారు ప్రాంతమైన హొసహళ్లి కి పోవలసి ఉంది.ఆ ప్రదేశానికి వెళ్లి హొసహళ్లి  కి దారి అడిగితే కొత్తపల్లి కి  ఇలా పోవాలి అని చెప్పారు.అదేంటి నేను హొసహళ్లి కి దారి అడిగితే కొత్తపల్లికి దారి చూపిసున్నారని కొంచం సేపు తిక మక పడ్డాను,తర్వాత అర్థం అయ్యింది వాళ్ళు చూపించింది నేను అడిగిన ఊరికే అని.కన్నడం లో హొస  అంటే  కొత్త అని,హళ్లి అంటే పల్లి అని అర్థం.అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.
                    ఇంకా ఒక ఒక ముఖ్యమైన విషయం ఏమంటే బెంగుళూరులో ఒక రోడ్డుకు వేమన పేరు ఉంది.వేమన జయంతి ఉత్సవాలు ఇక్కడ ,హోసూరు లో ఘనంగా చేస్తారు.కానీ మన దగ్గర వేమన గురించి ఎవరూ పట్టించు కునే వారే లేరు.మన వాళ్లకు తెలుగులో మాట్లాడడం చాలా నామోషి అయ్యింది.మన పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళలో వేసి అలా తెలుగు రాకుండా పోయి,ఇటు ఇంగ్లీషు రాక రెంటికీ చెడిన రేవడులు  అయ్యారు.ఆంధ్ర దేశం లో ఉన్న వాళ్ళ కంటే బయట ఉన్న వాల్లే తెలుగును బాగా కాపాడు కుంటున్నారు. తెలుగు భాష కలకాలం వర్థిల్లాలని కోరుకుంటూ .....

22, డిసెంబర్ 2012, శనివారం

రేప్ చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి కానీ...

డిల్లీ లో రేప్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి.శిక్షలు ఎలా ఉండాలంటే ,తిరిగి అటువంటి నేరం చేయాలనే తలంపు ఎవరికీ రాకూడదు. అందులో మరో ప్రశ్నకు తావు లేదు.రేప్ కు గురైన బాధితురాలు బాధ వర్ణనాతీతం.ఆమెకు ఏం చేసినా తక్కువే . కానీ హిపోక్రసి లేకుండా ప్రజలు ఒకటి ఆలోచించ వలసిన అవసరం ఏర్పడింది.ఈ మధ్య కాలం లో సెల్ ఫోనులు మరియు ఇతర సోషియల్ నెట్వర్కులు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ చాలా పెరిగి కొన్ని అనర్థాలు కూడా పెరిగాయి.పూర్వం ప్రేమ అనే పదానికి చాలా పవిత్రత ఉండేది.కాని నేడు దాని అర్థం చాలా కుచించు కొని పోయింది.తమ శారీరక అవసరాలు తీర్చుకొనడానికి కూడా ప్రేమ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు.ఇలాంటి ప్రేమికులు తాము మేజర్లము అయినామని తమకు అన్నీ తెలుసనీ వారి ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు.ఆ పనులు నాలుగు గోడల మధ్యన చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.కానీ ఈ మధ్యన వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు బహిరంగ ప్రదేశాలలో చేస్తున్నారు (ఉదా:బస్సులలో ,ఆటోలలో పబ్లిక్ పార్కుల్లో ,చివరికి దేవాలయాల్లో కూడా ...).ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు,చివరికి వాళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నారు .పబ్లిక్ పార్కులకు పిల్లలను తీసికెళ్ళా లంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇవి చూసిన కొంత మంది యువకులు ఆ అబ్బాయిని కొట్టి ,అ అమ్మాయిని రేప్ చేసిన సందర్భాలు చాలా వరకు మనం నిత్యం పేపర్లలో చూస్తున్నాము.కొన్ని తమ పరువు పోతుందని మీడియాకు ,పోలీసులకు తెలపని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.పార్కుల్లో శృంగారం,వెకిలి చేష్టలు చేస్తున్న  వాళ్ళను శిక్షించడానికి పోలీసులు వెలితే సదరు ప్రేమికులు తమకు  ప్రేమించే  హక్కు ఉందని ,తమ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని హక్కుల సంఘాల కార్యకర్తల తో కలిసి తీవ్రమైన నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి.ఇటువంటి వాళ్ళను ఎవరు శిక్షించాలి.కావున ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత  రోడ్ల మీదికి వచ్చి గొంతు చించుకునే బదులు అటువంటి వాటికి వీలైనంత వరకు అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది.

12, డిసెంబర్ 2012, బుధవారం

తప్పులు ఎంత చేస్తే అంత డబ్బులు వస్తున్నాయి!

ఈ మధ్యన ఊర్లలో వ్యవసాయ భూముల వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు.అందులో చాలా తప్పులు దొర్లుతున్నాయి.వాటిని సరిదిద్దుకొనడానికి  రైతులు నానా పాట్లు పడుతున్నారు.ఇప్పుడే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఈ తప్పులను సరిచేసుకోవడానికి తమ పనులు విడిచి పెట్టి పలుమార్లు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగ వలసి వస్తున్నది.కంప్యూటర్లో వాళ్ళే తప్పులు నమోదు చేసి ,సరిదిద్దమని రైతులు వెళితే డబ్బులు డిమాండ్ చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కంప్యూటర్లో నమోదు చేయు వాళ్ళు చాలా చోట్ల అవుట్  సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.వీళ్ళు తప్పులు ఎంత చేస్తే అంత డబ్బులు వస్తున్నాయి.ఇక్కడ తప్పుకు శిక్ష లేదు.రివార్డులు వస్తున్నాయి.అటువంటప్పుడు వాళ్ళు బాధ్యతగా ,సరిగా ఎందుకు చేస్తారు.తమ భూమి రికార్డ్ లో తప్పు ఉందని  రైతు అప్లికేషన్ తో  వచ్చిన ప్రతిసారి ,ఒక్కో తప్పుకు ఇంత అని పనిచేసే వాళ్ళ  జీతములో కోత  పెడితే  అప్పుడు పనులు సరిగా చేస్తారు .ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి.లేక పొతే కావాలనే కంప్యూటర్లో తప్పులు ఎక్కువ నమోదు  చేస్తారు.